Apr 03,2021 07:00

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) రెండు రోజుల కిందట తెలుగు రాష్ట్రాలపై డేగలా వాలింది. ప్రజల పక్షాన గొంతుక వినిపిస్తున్న సామాజిక కార్యకర్తలను, పౌర హక్కుల నేతలను లక్ష్యంగా చేసుకొని ఉభయ రాష్ట్రాల్లో ఏకంగా 31 ప్రాంతాల్లో జల్లెడ బట్టారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాంతక ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నిన సమయంలోనూ ఇంతటి విస్తృత గాలింపు జరిపిన దాఖలాలు మన తెలుగు రాష్ట్రాల్లో లేవు. అలాంటిది గొంతు లేని నిరుపేదల పక్షాన పోరాడుతూ సామాజిక న్యాయానికి కృషి చేస్తున్న కార్యకర్తలపై ఇంతటి తీవ్ర స్థాయిలో దాడులు చేయడం దారుణం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకునే మన దేశంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారనే ఏకైక కారణంతోనే కేంద్రం ఈ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నది యధార్థం. అధికార ముసుగులేసుకున్న బిజెపి పెద్దలు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి అణిచేత చర్యలకు పాల్పడుతుండగా..పాలనా వ్యవహారాలకు బయట ఉండే ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు హత్యలకూ వెనుకాడటం లేదు. గౌరీ లంకేశ్‌, ఎం.ఎం. కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే వంటి హేతువాదులను, సామాజిక కార్యకర్తలను ఇలానే పొట్టన పెట్టుకున్నారన్న సంగతి విదితమే. ఈ హత్యల వెనుకున్నదెవరో తెలుసుకునేందుకు జాగిలాలను వదిలితే అవి కచ్చితంగా సనాతన్‌ సంస్థ, హిందూ జన జాగృతి సమితి (హెచ్‌జెఎస్‌) వంటి కరుడుగట్టిన మతోన్మాద సంస్థలు ముందు వాలడం ఖాయం. వీరందరి హత్యలూ ఒకే తీరున జరిగినా..ఒకే ఆయుధం వినియోగించారని తెలిసినా దర్యాప్తు సంస్థలు అడుగు ముందుకేసింది లేదు. గో గూండాలు, గుంపుగా దాడులు చేసే మూకలు, ముసుగు వేసుకొచ్చి హత్యలు చేసే బైక్‌ గ్యాంగ్‌లు.. సంఫ్‌ు పరివార్‌ అవతారాలకు హద్దే లేదు.
బీమా కోరేగావ్‌ కేసులో నిందితులుగా ఉన్నవారు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ, ఆ విషయం నిందితుల కంప్యూటర్లలోని సమాచారం విశ్లేషిస్తే తెలిసిందంటూ అప్పట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు నానా యాగీ చేశాయి. వాస్తవానికి సదరు నిందితుల కంప్యూటర్లలోకి హ్యాకింగ్‌ ద్వారా చొరబడి ఆ సమాచారాన్ని వారికి తెలియకుండానే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా పొందుపర్చారన్న సంగతి అంతర్జాతీయ ఐ.టి నిపుణులు సాధికారికంగా నిరూపించారు. అందువల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల నేతల ఇళ్లలో స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న సాహిత్యం, ఇతర సామగ్రి కూడా అధికారులే వెంట తీసుకొచ్చారన్న విమర్శలు సత్యదూరం కాదు.
అక్రమంగా బనాయించిన బీమా కోరేగావ్‌ కేసులో మేధావులను, సామాజిక కార్యకర్తలను, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసనలు చేపట్టినవారిని, ప్రజాస్వామ్య చర్చలు నిర్వహించుకునే స్వేచ్ఛను హరిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూశాం. కాషాయ మూకలు యథేచ్ఛగా దాడులు చేస్తూ పట్టుబడినా అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన వినాశకర చట్టాలను వ్యతిరేకిస్తు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై దేశ ద్రోహం కేసులు బనాయించిన బిజెపి ప్రభుత్వం ..రైతులకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టిన వారినీ వదలడం లేదు. కేంద్ర పెద్దల ఆదేశాలతో కర్షకుల ఉద్యమాన్ని కార్పొరేట్‌ మీడియా తొక్కిపెడుతుంటే ధైర్యంగా కవరేజీ ఇచ్చిన 'న్యూస్‌ క్లిక్‌, ద వైర్‌' తదితర స్వతంత్ర వార్తా సంస్థలపైనా మోడీ సర్కార్‌ దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే.
మేధావులను, విద్యావేత్తలను, విద్యార్థులను, రైతులను ఇలా దేశంలో ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి ఒక్కరినీ అణిచేయాలని మోడీ సర్కార్‌ లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా దుర్వినియోగపరుస్తోంది. అప్రజాస్వామిక దాడులతో ప్రశ్నించే గళాలను, నిరసన స్వరాలను నులిమేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను సాగనివ్వరాదు. పౌర హక్కులను ప్రజలే పరిరక్షించుకోవాలి.