తెలుగు రాష్ట్రాల్లో కోటి భగవద్గీత పుస్తకాలు ముద్రణ : టిటిడి
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తెలుగు రాష్ట్రాల్లో కోటిమంది విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తమిళనం, కన్నడ, హిందీలోనూ ముద్రించే ఆలోచనలో టిటిడి ఉందన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత పెద్దఎత్తున నిర్వహించడంలో భాగంగా భగవద్గీతను విద్యార్థులకు అర్ధమయ్యేరీతిలో రాయించి పుస్తకాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పంపిణీ చేస్తామని తెలిపారు. చెన్నరు స్థానిక సలహా మండలి ఛైర్మన్‌గా గురువారం ఎజె శేఖర్‌రెడ్డి సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్య పురుషులు, హైందవ ధర్మ పెద్దల సూచనలతో రాబోయే రోజుల్లో పెద్దఎత్తున హైందవ ధర్మ ప్రచార కార్యాచరణకు దిగుతామని తెలిపారు. తమ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే రామకోటి తరహాలో గోవిందకోటి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 25ఏళ్లలోపు వయస్సున్న వారు గోవింద కోటి రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. చెన్నరు, కాట్పాడి మార్గాల నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తుల కోసం విడిది కేంద్రాలు నిర్మిస్తామన్నారు. భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి అనుమతి లభిస్తే తిరుమల నడకదారి వెంబడి ఫెన్సింగ్ నిర్మించే ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నరు స్థానిక సలహా మండలి ఛైర్మన్ ఎజె శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చెన్నరులోని శ్రీవారి ఆలయం, పరిసరాలు ప్రస్తుతం 5.5 గ్రౌండ్ల స్థలంలో ఉన్నాయన్నారు. ఆలయాన్ని 11 గ్రౌండ్ల స్థలంలో విస్తరిస్తామన్నారు. స్థలం కొనుగోలుకు ఇప్పటివరకూ 19 కోట్లు విరాళంగా వచ్చిందన్నారు. కన్యాకుమారి, తిరుచ్చి, మధురై, కోయంబత్తూరుల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ శంకర్, మాజీ బోర్డు సభ్యులు కుమార గురు ,డెప్యూటీ ఈవో విజయ కుమార్ పాల్గొన్నారు.
రూ.కోటి విరాళం
చెన్నై లోని శ్రీవారి ఆలయ విస్తరణకు అవసరమైన భూమి కొనుగోలు కోసం ట్రూ వ్యాల్యూ హోం సంస్థ తరపున వారి ప్రతినిధి రవిచంద్రన్ కోటి రూపాయల చెక్కును టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డికి అందజేశారు.
'తిరుమల ది సెవెన్‌హిల్స్ ఆఫ్ సాల్వేషన్' పుస్తకావిష్కరణ
తిరుచానూరు : తిరుమల ది సెవెన్‌హిల్స్ ఆఫ్ సాల్వేషన్ పుస్తకాన్ని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. తిరుమల చరిత్ర, వివేషాలతో ఈ పుస్తకాన్ని ముద్రించారన్నారు. చెన్నరు స్థానిక సలహా మండలి ఛైర్మన్ శేఖర్‌రెడ్డి, ది హిందూ సిఇఒ నవనీత్, బిజినెస్ లైన్ ఎడిటర్ రఘువీర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.
పుస్తకావిష్కరణలో టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, చెన్నరు స్థానిక సలహా మండలి ఛైర్మన్ శేఖర్‌రెడ్డి










