Mar 06,2021 07:22

'విశాఖ ఉక్కు - మన హక్కు' అంటూ అశేష ఆంధ్ర ప్రజానీకం నినదించింది. ఆంధ్రుల హక్కుగా నాడు 32 మంది బలిదానాలతో, వేలాది మంది రైతన్నల భూత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు ప్రయివేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. త్యాగధనుల మహోద్యమ స్ఫూర్తితో కేంద్రంపై పోరుకు బరిలోకి దుమికింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపుతో శుక్రవారం నాడు చేపట్టిన బంద్‌ దిగ్విజయంగా జరిగింది. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకూ రాష్ట్రం నలుమూలలా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడం అభినందనీయం. మోడీ సర్కార్‌ ప్రయివేటీకరణ విధానాలపై తెలుగుజాతి మొత్తం పోరు శంఖారావం పూరించడం ముదావహం. తెలంగాణ రాష్ట్రంలోనూ కార్మిక సంఘాలు పలుచోట్ల ధర్నాలు చేపట్టి విశాఖ ఉక్కు పరిరక్షణోద్యమానికి సంఘీభావం ప్రకటించడం తెలుగు ప్రజల ఐక్యతకు ప్రతీక. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బస్సులను డిపోలకే పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బంద్‌కు సంఘీభావం తెలియజేసింది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగానే సెలవు ప్రకటించాయి.
వామపక్షాల శ్రేణులు కలిసికట్టుగా కదిలి బంద్‌ను దిగ్విజయం చేయడంలో ప్రధాన భూమిక పోషించాయి. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలోనూ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటంలోనూ కార్మిక వర్గ నాయకత్వ పటిమను చాటాయి. 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అంటూ నాడు ఉక్కు పరిశ్రమను విశాఖకు సాధించిపెట్టిన మహోద్యమంలోనూ ముందు నిలిచి పోరాడింది వామపక్షాలేనన్న సంగతి విదితమే.
విశాఖలో జరిగిన భారీ ప్రదర్శనలో వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత విజయసాయి రెడ్డి, స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ పలుచోట్ల వైసిపి శ్రేణులు కదిలాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి బంద్‌లో భాగస్వామ్యమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఆందోళనలో రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి రెండూ కదలడం ఆహ్వానించదగ్గ పరిణామం. మున్సిపల్‌ ఎన్నికల ప్రచార ఒత్తిడి నేపథ్యంలో వైసిపి, టిడిపి భాగస్వామ్యం బంద్‌లో సంపూర్ణంగా కనపడకపోయినా బంద్‌ జయప్రదం చేయడంలో మాత్రం వాటి ప్రమేయం ఉన్నదన్నది నిజం.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అనేది బూటక ప్రచారమని, అస్సలు అలాంటి ప్రస్తావన వస్తే తామే ఢిల్లీ వెళ్లి నిలదీస్తామని తొలుత బీరాలు పలికిన బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు దాక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో ఏకాకిగా మిగిలిపోయింది కాషాయ పార్టీ. జనసేనానిది కూడా అదే పరిస్థితి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన...బిజెపి పంచన చేరిన నేపథ్యంలో బంద్‌లో రాష్ట్ర నాయకత్వం పాల్గొనలేక మిన్నకుండిపోయింది. అయితే బంద్‌ సందర్భంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో జనసేన శ్రేణులు పలుచోట్ల పాలుపంచుకోవడం విశేషం.
ప్రత్యేక హోదా విషయంలో గతంలో టిడిపి ప్రభుత్వం ఇదే మోడీ సర్కార్‌పై నాన్చుడి ధోరణి వ్యవహరించి మూల్యం చెల్లించుకుంది. ఢిల్లీని తలదన్నేలా రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి 'పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు'తో సరిపెట్టినా నాడు టిడిపిలో చలనం లేకపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన చివరిలో 'ధర్మ పోరాటం' అని విశ్వప్రయత్నం చేసినా వంచనను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇంటికి సాగనంపారు. టిడిపి చేసిన తప్పిదాన్ని ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో వైసిపి పునరావృతం చేయకుండా ఆది నుంచి తెగించి పోరాడాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర బంద్‌ చాటిచెబుతోంది.
తెలుగు ప్రజానీకాన్ని మదరాసీలుగానే గుర్తిస్తూ ఢిల్లీ పెద్దలు చులకనగా చూస్తుంటే ..ఆంధ్ర రాష్ట్ర సాధనతో ఆనాడే తెలుగువాడి సత్తా ఢిల్లీకి తెలిసొచ్చింది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి భాషా అవరోధాలతో నలిగిపోతున్న మిగిలిన ప్రజానీకానికి కాంతిదీపంగా నిలిచింది తెలుగువాడే. ఆంధ్రులు ఆరంభశూరులు కారనీ, పట్టు పడితే సాధించుకు తీరుతారనే విషయాన్ని అనేక సందర్భాల్లో కేంద్రంలోని ఆయా ప్రభుత్వాలకు గుర్తు చేశారు. అలాంటిది తెలుగు ప్రజల జనజీవనంలో మమేకమైన 'ఉక్కు' బంధాన్ని విడదీయాలని చూస్తే ఊరుకుంటారా? అందుకే ఇదే పోరాట స్ఫూర్తితో తెగించి పోరాడుదాం. విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం.