
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'
అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఇతను కవి, కథకుడు, నాటక కర్త.
తిలక్ శతజయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా.. ఆయన గురించి ప్రత్యేకం ఈ కథనం.
తిలక్ గురించి శ్రీశ్రీ అన్నట్టు వయస్సు సగం తీరకముందే కన్నుమూసిన ప్రజాకవి. నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి. సగం జీవితంలోనే ప్రయాణం పూర్తి చేసుకొని ఒక కవి అకస్మాత్తుగా మాయమైపోవడం సాహిత్యానికి, సాహిత్య ప్రేమికులకు తీరని లోటే. బహుశా ఆయన మరో 50 ఏళ్లు బతికి, సంపూర్ణ జీవితం గడిపి ఉంటే, సాహిత్యంలో, ప్రపంచంలో, మానవ జీవితంలో ఎన్ని మలుపులు చూసేవాడో.. ఏం మథనపడేవాడో.. ఏం రాసి ఉండేవాడో.. ఆ ఊహే ఉద్వేగభరితంగా ఉంటుంది. అయినా కవికి అస్తమయం లేదు కదా ! వాస్తవానికీ సూర్యుడికీ అస్తమయం లేదు. ఒక చోట అస్తమిస్తే ఒక చోట ఉదయిస్తాడు సూర్యుడు. ఉదయాస్తమయాలను మన చూపులతో మాత్రమే కొలుస్తాం. రవి ఆకాశంలో ఎక్కడో ఒకచోట ఉన్నట్టే, కవీ ఉంటాడు మన హృదయాకాశంలో.
కొద్దిపాటి జీవితంలోనే..
తిలక్ బతికింది 45 సంవత్సరాలు. అందులో దాదాపు పదేళ్లు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. రచనలో పరిపక్వత పొంది, భావాల్లో, ఆలోచనల్లో, తాత్విక అన్వేషణలో ఒక గాఢమైన దశకు చేరుకునేసరికే తిలక్ వెళ్లిపోయాడు. భావ కవిత్వ ప్రభావంతో వందలాదిగా పద్యాలు రాసినా, ఎన్నో నాటికలూ నాటకాలూ రాసినా, అభ్యుదయ మార్గం వైపు తన కలాన్ని మళ్లించిన కొద్దికాలానికే తన పని ముగించుకుని, మరలిపోయాడు. బతికిన 45 ఏళ్లలో 15 సంవత్సరాలు బాల్యాన్ని తీసేస్తే, గదిలో ఒక్కడే అనారోగ్యంతో మంచానికి అతుక్కుపోయిన పదేళ్ల కాలాన్నీ తీసేస్తే, ఆయన శక్తిమంతంగా సాహిత్య క్షేత్రంలో శ్రమించింది 15 ఏళ్ళు కూడా ఉండదు. ఆ కొద్ది కాలంలోనే, తనకు చిక్కిన ఆ కొద్దిపాటి జీవితంలోనే అమృతం కురిసిన రాత్రి లాంటి అమరత్వాన్ని తెలుగు కవిత్వానికి అద్ది తిరుగు ప్రయాణం కట్టాడు.
అమరుణ్ణి చేసిన సంపుటి

దేవరకొండ బాల గంగాధర తిలక్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి పక్కనే ఉన్న మండపాక గ్రామంలో 1921, ఆగస్టు 1వ తేదీన, వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్ననాటి నుంచే తండ్రి ద్వారా మంచి సాహిత్య జ్ఞానాన్ని, జాతీయ స్పృహనీ పుణికి పుచ్చుకున్నాడు. 19 ఏళ్ళ వయసులోనే 1940 లో 'సుప్రభాతం- సంధ్య' అనే పేరు మీద కావ్యాన్ని స్వయంగా ప్రచురించాడు. బాల్యదశలో రాసిన పద్యాలూ గేయాలూ ఇందులో ఉన్నాయి. 300 పద్యాలతో రాసిన 'మండోదరి' కావ్యం ఎక్కడో పోయింది. ఆయన చనిపోయిన తరువాత 'గోరువంకలు' అనే పద్యకావ్యాన్ని 1993లో ప్రచురించారు. అభ్యుదయ స్పృహతో రాసిన వచన కవిత్వం ఆయన చనిపోయిన తరువాత అంటే 1968లో 'అమృతం కురిసిన రాత్రి' పేరిట ప్రచురింపబడింది. ఆయన రాసిన కథల పుస్తకం కూడా ఆయన మరణానంతరం 67లో అచ్చయింది. 'సుప్తశిల, ఇరుగుపొరుగు, సుచిత్ర ప్రణయం, పొగ'లాంటి నాటికలు, అలాగే 'సుశీల పెళ్లి, సాలెగూడు' వంటి నాటకాలూ ఉన్నాయి. ఆయన రాసిన వ్యాసాలు చాలా తక్కువ. మిత్రులకు రాసిన లేఖల్లో చాలా విషయాల మీద ఆయన అభిప్రాయాలు మనకు తెలుస్తాయి. తిలక్ రాయాలనుకొని అసంపూర్ణంగా వదిలేసినవి, రాయలేకపోయినవి చాలా ఉన్నాయి. అన్నింటిలోకి తిలక్ మరణానంతరం పుస్తక రూపంలో ప్రచురణకు నోచుకున్న 'అమృతం కురిసిన రాత్రి' వచన కవితా సంపుటి తిలక్‌ని అమరుణ్ణి చేసింది.
ప్రభావం.. ప్రత్యేకం ..
ఒక కవిని మూల్యాంకనం చేసేటప్పుడు ఆ కవి బతికిన కాలాన్ని, ఆ కాలపు సాహిత్యాన్ని, ఆనాటి రాజకీయ సామాజిక, ఆర్థిక పరిణామాలనూ దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నింటికీ మించి ఆ కవి, తదనంతర కాలంలో ఎంత సజీవంగా సాహిత్యంలో నిలిచి ఉన్నాడో నిజాయితీగా అంచనా వేయాలి. మన సిద్ధాంతాలను ముందు పెట్టుకుని ఆ ఫ్రేములో ఒక కవిని ఇరికించాలని చూసినప్పుడు గందరగోళం పుడుతుంది. ఆ కవిని మాత్రమే ముందు పెట్టుకుని అతని సాహిత్యాన్ని, అందులో ఉన్న సైద్ధాంతిక తాత్విక విలువల్ని, ఎలాంటి బాహిరకమైన ముద్రలు వేయకుండా విశ్లేషించినప్పుడే ఆ కవికి సరైన స్థానాన్ని మనం ఇవ్వగలుగుతాం. తిలక్‌లాంటి కవుల గురించి మాట్లాడినప్పుడు శ్రీశ్రీ ప్రస్తావన రాకుండా ఉండదు. కానీ విచిత్రంగా శ్రీశ్రీ గురించి మాట్లాడినప్పుడు శ్రీశ్రీ ప్రస్తావనే ఉంటుంది. తెలుగు కవిత్వాన్ని చుట్టుముట్టిన శ్రీశ్రీ విరాట్ రూపం అలాంటిది. అంతటి విశాలమైన మహావృక్షాల కింద చిన్న మొక్కలు మొలిచి, బతికే అవకాశం లేదంటారు. కానీ సాహిత్యరంగంలో ఏ చెట్టు ప్రభావం ఆ చెట్టుదే. ఏ మొక్క ప్రభావం ఆ మొక్కదే.
మధ్యతరగతిలో కలవరం..

కవిత్వంలో పొలాలూ హలాలూ.. కర్మవీరులూ ధర్మవీరులూ.. అథోజగత్ సహోదరులూ.. మరో ప్రపంచాబ్జపు తెల్లరేకులూ.. భూ మార్గం పట్టిన జగన్నాథుని రథచక్రాలూ.. భూ కంపం పుట్టించిన అక్షర రణన్నినాదాలూ యువకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ శ్రీశ్రీ వెంట పరుగులు తీయిస్తున్న కాలంలో, మధ్య తరగతి గొంగళి పురుగుని చూపించి, కలవరపెట్టాడు తిలక్. సైనికుని ఉత్తరాలు చదివించాడు. తపాలా బంట్రోతులాంటి సామాన్య వర్గపు బతుకుల అతుకుల కోటు లోపలి కల్లోలాలు చూపించాడు. ఉత్తరం ఇచ్చి, నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే పోస్టుమాన్‌లాంటి మిడిల్ క్లాస్ నిస్సహాయుల్ని కవిత్వ కాన్వాసు మీద బల్లపరుపుగా పరిచి, చిత్రించాడు. అదంతా చూసినప్పుడు, తెలుగు కవిత్వ లోకానికి తీరం వదిలి, సమద్రంలోకి పోతూన్న నౌక చప్పుడు వినిపించింది. సగం సగం తిన్న కలల్ని నెమరు వేస్తూ, సగం సగం చచ్చిన ప్రాణాల్ని జోకొట్టుకుంటూ ఎడారి ఇసుకలో జీవన నౌకల్ని లాగుతున్న సాధారణ జీవి తెలుగు కవిత్వంలోకి అడుగుపెట్టడం తిలక్ పుణ్యమే. అట్టడుగు జీవుల బతుకు చిత్రాల కంటే మధ్య తరగతి మందహాసాలు సాహిత్య జీవులకూ, పాఠకులకూ చాలా దగ్గరగా కనిపించాయి. చినిగిన స్వప్నపు సంచిలో చితికిన బాష్పాల్లాంటి తిలక్ శబ్ద చిత్రాలు.. ఆ వర్ణనలు ఆ తర్వాతి తరాన్ని వాక్యనిర్మాణంలో కొత్త దారులు తొక్కించాయి.
సున్నితత్వం అవసరమే..

దాదాపు నలభై ఏళ్లుగా కవిత్వంలో ఉన్నవాడినిగా, తెలుగులో, అలాగే ప్రపంచంలో వచ్చిన సాహిత్యాన్ని చూస్తున్నవాడిగా నిజాయితీగా ఒక మాట చెప్పాలంటే.. నా తరం తెలుగు కవుల మీద తిలక్ ప్రభావం చిన్నదేమీ కాదు. శ్రీశ్రీ లాంటి మహాకవులతో పోటీ పెట్టి ఇప్పుడు మనం తేల్చేది ఏమీ లేదు. కవిత్వంలో అలాంటి యుద్ధాలు కాలక్షేపానికే కాని, కాలంలో నిలవవు. కవిత్వం గాఢమై, వస్తువు విస్తృతమై, వ్యక్తీకరణ వినూత్నంగా సాగుతున్న ఈ కాలంలో తిలక్ లాంటి కవుల ప్రభావం అంతర్లీనంగా ఉందని ఒప్పుకోవాలి. మన విమర్శకులు సామాజికతకు ఎంత పెద్ద పీట వేశారంటే, సౌందర్యాత్మకతకు చిన్న చోటు కూడా దొరకనంత. ఎక్కడా పైకి చెప్పరుగానీ వారు విశ్లేషించే కవితలు, కథలు, నవలలు, వస్తువులూ అన్నీ, వారు ముందే ఏర్పరచుకున్న భావజాలానికి, వారు నమ్మిన సిద్ధాంతానికీ అనుగుణంగానే ఉంటాయి. మిగిలిన వాటిని పక్కనపెడతారు. మరీ వారు దృష్టిని మరల్చుకోలేనంత గొప్పగా ఒక రచన వస్తే, ఆహా అని పెదవి చప్పరిస్తూనే 'అందం కిందపడి, వాస్తవం నలిగిపోయిందబ్బా' అని తిరుగులేని దెబ్బ కొడతారు. ఇక్కడే కవులకు విమర్శకులతో పేచీ. సెన్సిబిలిటీ లేని రెస్పాన్సిబిలిటీ కవిత్వంలో బతకలేదు. కవిత్వం వరకూ వస్తే ఏదైనా దాన్ని వ్యక్తీకరించే తీరు పాఠకుడి ఆత్మను తాకాలి. అలా చూసినప్పుడు తిలక్ తన తర్వాత తరం కవులపై వేసిన ముద్ర సామాన్యమైంది కాదు. శ్రీశ్రీ నుంచి ఎటు నడవాలో తెలుసుకున్న తెలుగు కవి, తిలక్ నుంచి ఎలా నడవాలో అర్థం చేసుకున్నాడు. వాక్యంలో సున్నితత్వం, వ్యక్తీకరణలో మృదుత్వం, శబ్ద చిత్రాలలో, భావ చిత్రాలలో అందమైన అనుభూతితత్వం తిలక్ నుంచే విస్తరించిందని చెప్పాలి.
ఆమోదయోగ్యం కాని భావనలు..

తిలక్ ప్రేమించి పూజించిన సంస్కృతి, తిలక్ అభిమానించిన దేశీయత, ప్రదర్శించిన దేశభక్తి, వ్యక్తం చేసిన ఆధ్యాత్మిక ధర్మ భావనలూ ఆధునిక కవికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఆయన తీసుకున్న వస్తువును కవిత్వం చేయడంలో కొత్తతరం కవులకు తిలక్ ఆదర్శమే. ఆ మేరకే ఆయన్ని స్వీకరించగలం. ఆనాడు తిలక్ వ్యక్తం చేసిన దేశభక్తి ఈనాటి కాషాయ దళాలకు పరమ ప్రీతిగా కనిపించవచ్చు. యుద్ధమంటే అసహ్యమే కాని, చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధమంటే గర్వమే. విశ్వనాథ సంస్కృతి పట్ల వ్యతిరేకతే కాని, భారతీయ పురాసంస్కృతి పట్ల ఆరాధనే. గాంధీ భావాలను కొన్ని వ్యతిరేకిస్తూనే దేవుడు కంటే గొప్పవాడుగా గాంధీని పూజించడం, ఆర్ష ధర్మాన్నీ అభ్యుదయాన్నీ, ఆధ్యాత్మికతనూ కళాత్మకతనూ మిక్స్ చేయాలనుకోవడం.. ఇవన్నీ తెలుగు కవులు ఎవరూ పెద్దగా ఆదర్శంగా తీసుకోలేరు.. తీసుకోలేదు.
పరిమితమైన స్థానమే..

'నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం' అంటే.. దాన్ని ఏ తెలుగు కవీ తన మార్గంగా భావించలేదు. 'గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ, జాజిపువ్వుల అత్తరు దీపాలూ, మంత్ర లోకపు మణి స్తంభాలూ' లాంటి వాక్యాలను తెలుగు కవి గుండెలకు హత్తుకున్నాడు. తనది ధనిక వాదం కాదు, సామ్యవాదం కాదు అంటే, అంత అయోమయం మాకు లేదు అని తెలుగు కవులు నిక్కచ్చిగా తేల్చుకున్నారు. కన్నీటి జడులలో తడిసే దయాపారావతాల్లాంటి, ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాల్లాంటి, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లల్లాంటి తిలక్ అక్షరాలను తెలుగు కవులు ముచ్చటగా స్వీకరించారు. కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయాలంటే సెభాష్ అన్నాం. కవిత్వంలో అగ్నినీ జల్లాలి.. అమృతాన్నీ కురిపించాలంటే జయహో అన్నాం. 'దారంతా గోతులు.. ఇల్లేమో దూరం.. చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం' అంటే.. మా కవిత్వాలకు ఇలాంటి వాక్యాలను కవచాలుగా తొడుక్కున్నాం. 'చిన్నమ్మా నేను వెళ్ళొస్తాను, చీకటి పడుతోంది' అంటే.. కన్నీళ్ళు పెట్టుకున్నాం. కానీ తిలక్‌లా కవిత్వాన్ని దైవిక భావనగా మార్చుకోలేకపోయాం. అందుకే తిలక్ స్థానం కొంతవరకే పరిమితం. కవిత్వానికి ముఖ్యంగా ఏం కావాలో ఆ ప్రాణశక్తిని అందించినందుకు అతను మరణించిన 60 సంవత్సరాలకు కూడా తలచుకుంటున్నాం. ఆయన మరికొంత కాలం బతికితే అటో ఇటో తేల్చుకునేవాడో కాదో.
దేశభక్తికి కొత్త అర్థాలు, వాక్ స్వాతంత్య్రానికి ప్రత్యక్షంగానే సంకెళ్ళు, దేశీయ సంస్కృతికి, సంప్రదాయాలకూ కసాయీకరణల సూత్రీకరణలూ, యుద్ధానికి, శాంతికి కొత్తకొత్త పర్యాయపదాలు, అడుగడుగునా అడ్డుపడుతున్న ఆధ్యాత్మిక అధ్వాన్న ధర్మాలూ, చచ్చు పుచ్చు నీతులూ, కాలం చెల్లిన కపట కారుణ్యాలూ చెలామణిలో ఉన్న ఈ కాలంలో తిలక్ ఉంటే తన అంతరాత్మను తిరగరాసుకునేవాడేమో. కానీ కాలం ఆయన్ని మాయం చేసింది కదా ! అందుకే ఆయన ఉన్నప్పుడు వ్యక్తం చేసినదే మనకిప్పుడు చర్చనీయాంశం. అయితే నాలాంటి తెలుగు కవులు శ్రీశ్రీనీ తిలక్‌నీ కలిపి నడిచారు. కాబట్టే పాయలు పాయలుగా తెలుగు కవిత, కథా, నవలా చీలిపోయినా, బలంగా వ్యక్తమవడంలో ఎక్కడా ఆదిమ కాలంలోనే ఆగిపోలేదు. మార్గం శ్రీశ్రీది, వాక్యం తిలక్‌ది. తిలక్‌తో పాటు శేషేంద్ర, బైరాగి, ఇస్మాయిల్, వేగుంట, అజంతా తర్వాత దిగంబర కవులూ ఇలా పలువురు తమదైన కంఠంతో ముందుకు రాబట్టే మనం నిలదొక్కుకున్నాం. ఈ శతజయంతి నాడు తిలక్‌ని ఇలా స్మరించుకోవడం గొప్ప ఆనందాన్నిచ్చింది. తిలక్ లేడు కాని, ఆయన మాటల్లోనే చెప్పాలంటే..
నువ్వు లేవు నీ పాట వుంది,
ఇంటి ముందు జూకా మల్లెతీగల్లో అల్లుకుని
లాంతరు సన్నని వెలుతుర్లో క్రమ్ముకుని,
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని
నీరవంగా నిజంగా వుంది
శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్రమైన మార్పుని
గుర్తుకు తెస్తోంది ఇన్నేళ్ళ తర్వాత.
శ్రీశ్రీకి ఎప్పటికీ పోటీ లేదు..
శ్రీశ్రీ ప్రభావం నుంచి తెలుగు కవిని బయట పడేసిన వాడు తిలక్. అసలు శ్రీశ్రీ నుంచి ఎందుకు బయటపడాలి? తెలుగు కవిత్వానికి చూపునీ, ఊపునీ ఇచ్చిన శ్రీశ్రీ నుంచి విముక్తిని కోరుకోవడం ఎంతటి చారిత్రక ద్రోహం? నిజమే. కానీ శ్రీశ్రీ మోహం ఒక మాయగా కమ్మిన కాలం అది. ఆ అందమైన మాయపొరను ఛేదించుకోకుంటే ఒక శ్రీశ్రీ తప్ప మరొకరు మిగిలేవారు కాదు. ఈ శతాబ్దం తనదే అనుకున్న మహాకవి తానే పూర్తిగా ఆక్రమించేసేవాడు. వాక్యము నినాదమై అదే ఉన్మాదమై ఊపేస్తున్న కాలంలో ఇక అక్కడి నుంచి బయటపడితే తప్ప తెలుగు కవికి మనుగడ లేదు అన్న దశలో ఆదుకున్నాడు తిలక్. అలాగని శ్రీశ్రీని విడిచింది లేదు. కొందరి ప్రభావాలు కొన్ని చారిత్రక దశల్లోనే ఉంటాయి. తెలుగు కవిత్వాన్ని సామ్యవాద స్వప్న శిఖరాల మీద కూర్చోబెట్టిన శ్రీశ్రీకి ఎప్పటికీ పోటీ లేదు. కానీ కవిత్వంలోకి వచ్చేసరికి మనం రాసే వాక్యాల్లో శ్రీశ్రీయే కనబడితే మనకే కాదు మన తెలుగులో కవిత్వానికే మనుగడ లేకుండా పోతుంది. అందుకే తెలుగు కవి, శ్రీశ్రీని ఆయుధంగా ధరించి, దారి మాత్రం తనదైనదే వేసుకున్నాడు. అలా వేసుకోవడంలో తెలుగు కవి చేతిలో లాంతరులా వెలిగాడు తిలక్. ఎన్ని అస్థిత్వ ఉద్యమాలు, ఎన్ని పోకడలు, ఎన్ని ధోరణులు, ఎన్ని కెరటాలుగా తెలుగు సాహిత్యం ఉవ్వెత్తున లేచింది? శ్రీశ్రీ దగ్గరే ఆగిపోయి ఉంటే తెలుగు సాహిత్యంలో భిన్నత్వానికీ వినూత్న దృష్టికీ స్థానమే లేకుండా పోయేది. బలమైన వాక్యమే పది కాలాలు నిలుస్తుంది. తిలక్ సృష్టించిన కవిత్వాన్ని అది వేసిన ప్రభావాన్ని చూస్తే ఆయన మరికొంత కాలం బతికి ఉంటే తెలుగు సాహిత్యానికి అద్భుతమైన నిధులు ఎన్నో సమకూర్చి ఉండేవాడని ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.
తెలుగు కవిత్వంలో ఆయన కంట్రిబ్యూషన్ తక్కువే కాని, కంటిన్యుయేషన్ ఎక్కువ. అయితే తిలక్ వేసిన ప్రభావానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. తిలక్ రాసిన కథల్లో ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది. అవి కూడా విద్యావంతులైన మధ్య తరగతి జీవులకు పరిచయమైన జీవితాల చుట్టూ అల్లుకున్నవే. అయినా తిలక్ కవిత్వం చూపించిన ప్రభావం కథల్లో ఉండదు. సుప్తశిలలాంటి నాటికలో కనిపించిన విప్లవాత్మక భావాలు కొన్ని కథల్లో కూడా ఉన్నా వాటి ప్రభావం పరిమితమే. తెలుగు కవిత్వానికి తనను ఎలా కొత్తగా వ్యక్తీకరించుకోవాలో నేర్పించిన వాడుగా తిలక్ స్థానం తిలక్‌దే. కానీ తెలుగు కవులకు ఒక భావజాలాన్ని, ఒక తాత్వికతను, ఒక సైద్ధాంతికతను అందించడంలో శ్రీశ్రీ స్థానం శ్రీశ్రీదే.
ప్రసాదమూర్తి
84998 66699