ప్రజాశక్తి-తెనాలి : తెలుగుజాతి గర్వించ దగ్గ వ్యక్తి, మనిషిని మనిషిగా తీర్చి దిద్దే సాహిత్యానికి నాంది పలికిన ఘనుడు డాక్టర్ సంజీవ్‌దేవ్ అని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కవి, రచయిత, చిత్రకారుడు డాక్టర్ సంజీవ్‌దేవ్‌పై రసధ్వని (సంజీవ్‌దేవ్ సాహిత్యం-జీవితం) పేరిట రూపొందించిన పుస్తకావిష్కరణ సభ ఆదివారం రాత్రి స్థానిక నందుపేట కవిరాజాపార్కులోని సీనియర్ సిటిజన్స్ హాల్లో నిర్వహించారు. డాక్టర్ సంజీవ్ దేవ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన సభకు ప్రజాసాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సంజీవ్‌దేవ్ ఓ మంచి చిత్రకారుడని, ఆయన సాహిత్యం సామాజిక పరిస్థితులకు అత్యంత సమీపంగా ఉంటుందన్నారు. అన్నింటినీ మించి సంజీవ్‌దేవ్ ప్రకృతి ప్రేమికుడని, పాశ్చాత్య దేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నా, మాతృభూమిపై మమకారంతో స్వగ్రామం తుమ్మపూడిలోనే ఉన్నారన్నారు. ఎంతో విశాలమైన భావాలు కలిగిన వ్యక్తని కొనియాడారు. సంజీవ్‌దేవ్ జీవిత విశేషాలు, సాహితీ సంపదపై ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్, ప్రముఖ వైధ్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, కొత్తపల్లి రవిబాబు వివరించారు. రసధ్వని పుస్తకాన్ని సాహితీప్రియులు రమణ, ఎన్‌ఆర్ తపస్వి, వి.వెంకటరత్నం సంకలనం చేశారన్నారు. ఈ సందర్భంగా రసధ్వని పుస్తకాన్ని ఆవిష్క రించారు. తొలుత సంజీవ్‌దేవ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ సంజీవ్‌దేవ్ ఫౌండేషన్ కార్యదర్శి వైవి రావు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.










