
ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రతి ఒక్కరూ తెలుగు భాషను ప్రేమించి, ప్రోత్సహించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో తెలుగు దండు ఆధ్వర్యాన సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పరవస్తు సూరి రచించిన 'తెలుగుభేరి' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాషలో పద్యాలు, సాహిత్యం, గేయాలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. తెలుగు పద్యం ఎంతో సుందరమైనదన్నారు. తెలుగు భాషలో ప్రచురించిన పద్యాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి, భాషా పరిజ్ఞానం మరింత పెరుగుతుందని తెలిపారు. మాతృభాషను విద్యాభ్యాసంలోనే పెంపొందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలన్నారు. ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో విద్యాభ్యాసం ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వాలు మాతృభాషపై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశాలలో మాతృభాషను ముందు ప్రోత్సహించి తర్వాత పరభాషకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యత లేకపోతే పత్రికలు, టీవీ చానళ్లు కనుమరుగయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. మాతృభాషను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రసార సాధనాలపై ఉందన్నారు. తెలుగుభేరి పుస్తక రచయిత పరవస్తు సూరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మణ్ కంపెనీ అధినేత సూరపనేని విజరుకుమార్, శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ప్రతినిధి డాక్టర్ ఉమర్ ఆలీషా, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.