ప్రజాశక్తి-గుంటూరు : మాతృభాష తెలుగును వ్యవహారిక భాషగా తీర్చిదిద్దిన గిడుగు వెంకట రామమూర్తి కృషి మరువలేనిదని గుంటూరు జిల్లా జెసి జి.రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గిడుగు వెంకట రామమూర్తి జయంతి వారోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి అధికారులకు రెండు నిమిషాలు ఇతర భాష పదాలు పలకకుండా తెలుగులో మాట్లాడే పోటీలు, స్థానిక ప్రముఖులతో కవి సమ్మేళనం నిర్వహించారు. జెసి మాట్లాడుతూ తెలుగు భాషను ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిడుగు వెంకట రామమూర్తి జయం తిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగు భాషా వారోత్సవాలను 23-29 తేదీల్లో నిర్వహించుకుంటునట్లు తెలిపారు. ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో వ్యాస రచన, వక్తృత్వం, తెలుగు పద్య పోటీలు, కవితలు, అంత్యాక్షరి, జానపద గేయాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగుభాష ఔన్నత్యం గురించి వివరించారు. మరే ఇతర భాషలు నేర్చుకోవాలన్నా మాతభాష తెలుగు అందుకు పునాది వేస్తుందన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జేసీ రాజకుమారి










