ప్రజాశక్తి - బాపట్ల
తెలుగు భాషా వికాసంలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాపట్ల కవులు ఎందరో తెలుగు భాషను సుసంపన్నం చేశారని అన్నారు. తెలుగు భాషార్చన చేసిన బాపట్ల కవులలో రాయప్రోలు, తుమ్మల, జాషువా అగ్రగణ్యులని తెలిపారు. బాపట్ల తెలుగు తల్లి పుట్టినిల్లని అన్నారు. తెలుగు తల్లికి బాపట్ల జీవం పోసిందన్నారు. తెలుగు సాహిత్యం బాపట్లలోనే ఓనమాలు దిద్దుకుందని అన్నారు. తెలుగు పద్యం బాపట్ల గడ్డ మీదే పుట్టిందన్నారు. తెలుగుకు కావ్య భాష హోదా కల్పించింది బాపట్లే అని అన్నారు. తెలుగు పద్య మహాసౌదానికి పునాది రాళ్లు మోసింది బాపట్ల వాసులేనని తెలిపారు. తెలుగు భాషామ తల్లి కంఠంలో పలువురు బాపట్ల కవులు మల్లెపూదండలు వేశారని అన్నారు. తెలుగు వాంఙ్ఞ్మయ చరిత్రలో లేఖాసాహిత్యానికి శ్రీకారం చుట్టింది బాపట్ల కవయిత్రి కనుపర్తి వరలక్షమమ్మ అని గుర్తు చేశారు. ఇలా తెలుగు భాష అభివృద్ధిలో బాపట్ల ప్రముఖ పాత్ర పోషించిందని వివరించారు. బాపట్లకు చెందిన ఎందరో కవులు, కళాకారులు తెలుగు భాషకు పెద్దపేట వేశారని అన్నారు.










