ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తెలుగు ప్రజల సత్తా చాటి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం కాకుండా కాపాడుకుందామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ప్రారంభమైన విశాఖ ఉక్కు రక్షణ బైక్ యాత్ర బుధవారం సాయంత్రం విజయనగరానికి చేరుకుంది. స్థానిక వై-జంక్షన్ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యాన యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వై-జంక్షన్ నుంచి మయూరి జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డు, ఎన్‌సిఎస్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట జంక్షన్ మీదుగా బాలాజీ కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాజీ జంక్షన్ సమీపంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోందని తెలిపారు. దీన్ని ప్రయివేట్ పరం చేయడమంటే దళితులు, గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోతారని, సామాజిక న్యాయం హరించుకుపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నేటికీ ప్లాంట్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయని వాపోయారు. ప్లాంట్ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. స్టీల్‌ప్లాంటును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరిస్తే ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకి నెట్టబడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన కేంద్ర నిర్ణయానికి వంతపాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ పార్టీలు కేంద్రంలోని బిజెపి విధానాలను బలపరిచేవిగా ఉన్నాయని ఆక్షేపించారు. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవడం కేవలం తెలుగు ప్రజల చైతన్యంపైనే నేడు ఆధారపడి ఉందన్నారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
అనంతరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఎంతో ద్రోహం చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు సాహసించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రంలోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని తేటతెల్లమైందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్న స్టీల్‌ప్లాంట్‌ని అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 29న విశాఖలో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రూపొందించిన గీతాలకు ప్రజా నాట్య మండలి కళాకారులు నృత్య ప్రదర్శన చేసి అలరించారు. సభలో సిపిఎం పాడేరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నాయకులు సత్యనారాయణ, జగన్, తిరుపతిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.వి.రమణ, నాయకులు జగన్, పి.రమణమ్మ, పి.రామ్మోహన్, స్లీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామారావు, సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.సురేష్, తదితరులు పాల్గొన్నారు.










