- వచ్చే నెల నుంచి చోడి పిండి సరఫరా
- జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్
ప్రజాశక్తి - రంపచోడవరం
ఏజెన్సీలోని తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రతినెల నిత్యవసర సరుకులు సకాలంలో సరఫరా చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు సంబంధించిన జిసిసి అధికారులు, సేల్స్‌మెన్లు, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సివిల్ సప్లై డీలర్లు, ఎండియు వాహనాల ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి శివ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెలా 1 నుండి 17వ తేదీ మధ్య నిత్యావసర వస్తువులను ఎండియు వాహనాల ద్వారా సరఫరా చేయాలన్నారు. ప్రతినెలా సరుకులను మండల స్టాక్ పాయింట్‌కు ఎప్పటికప్పుడు చేరవేసి ఆయా సివిల్ సప్లై డిపోల ద్వారా లబ్ధిదారునికి బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన రిక్వైర్మెంట్లు ఎప్పటికప్పుడు ఇండెంట్లు సమర్పిస్తే ఆ ప్రకారం సరుకులు చేరవేయడం జరుగుతుందని చెప్పారు. ఏజెన్సీలోని ప్రతి సివిల్ సప్లై డిపోలలో వచ్చే నెల నుండి చోడి పిండి సరఫరాకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఏజెన్సీలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వారానికి మూడు రోజుల పాటు రాగి జావాతో పాటు 10 గ్రాముల బెల్లం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సివిల్ సప్లై షాపులలో డివైజర్ లేని వారికి వాటిని సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డుదారునికి సరఫరా చేసే సరుకులు ఫొటో, వీడియో తీసి గ్రూప్లో పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి శివప్రసాద్, సివిల్ సప్లై డిఎం గణేష్ కుమార్, ఏఎంవో సి.శ్రీహరి, సిడిపిఓ సంజ్య రాణి, లక్ష్మి, ఎస్‌ఎంఎంఎన్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










