తెల్ల రేషన్ కార్డుదారులందరికీ
ఉచితంగా కిలో జొన్నలు పంపిణీ
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కేజీ జొన్నలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 29వ వార్డు సాధిక్ నగర్‌లో బియ్యం కార్డుదారులకు ఉచితంగా కిలో జొన్నలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జెసి నిశాంతి.టి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండియూ వాహనాల ద్వారా జిల్లాలోని 5,33,000 తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కిలో జొన్నలు చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నంద్యాల జిల్లాలో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జెసి మాట్లాడుతూ 2023 సంవత్సరాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల సంస్థ నుంచి జిల్లాలో 2022-23లో 2859.150 మెట్రిక్ టన్నుల జొన్నలను జిల్లా రైతుల నుంచి నేరుగా సేకరించామన్నారు. ఇందుకు రూ.8.55 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. బలవర్థక ఆహార పదార్థమైన జొన్నలను ప్రతి ఒక్కరు సక్రమంగా వినియోగించు కోవాలన్నారు. భవిష్యత్తులో చిరుధాన్యాల పంపిణీకి చర్యలు తీసుకుంటా మన్నారు. ఆళ్లగడ్డ : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కేజీ బియ్యం బదులు కేజీ జొన్నలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి తెలిపారు. పట్టణంలోని నాలుగో వార్డ్ పుల్లారెడ్డి వీధిలో ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ హరినాధరావు, ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపవరం నర్సింహా రెడ్డి, వైసిపి నాయకులు సింగం వెంకటేశ్వర రెడ్డి, శివ నాగేశ్వర రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు రమేష్ గౌడ్, గంగుల రామిరెడ్డి, ఇంజెడు గజ్జల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










