ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని చౌడువాడ గ్రామంలో తెగుళ్లు సోకి చచ్చిపోతున్న చెరకు తోటలను చెరకు పరిశోధన శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. 'చెరకు తోటలకు తెగుళ్లు' శీర్షికన గురువారం ప్రజాశక్తి ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయశాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు చౌడువాడలోని చెరకు తోటలను సందర్శించి మొక్క మొదళ్లను పరిశీలించారు. చచ్చిపోతున్న చెరకు తోటలకు ఎర్రకుల్లి తెగులు సోకిందని తేల్చారు. ప్రస్తుతం సాగు చేస్తున్న రకం చెరకు తోటలను ఇకపై నాటొద్దని బాధిత రైతు చిన్ని చిన్నతల్లికి సూచించారు. వ్యవసాయ అధికారులు తెలిపిన చెరకు రకాలు మాత్రమే రైతులు సాగు చేయాలన్నారు. పాతరకం చెరకును ఎవరూ సాగు చేయొద్దని సూచించారు. తెగుళ్లను తట్టుకొనే రకాలను పరిశోధకులు ఎంపిక చేశార, వాటిని నాటుకున్నట్లయితే రైతులకు మేలుజరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి తులసి మణి, అనకాపల్లి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్, మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్, వ్యవసాయ విస్తరణ అధికారి లైలాదేవి, వ్యవసాయ సహాయకురాలు రామాంజలి పాల్గొన్నారు.










