Dec 10,2022 23:02

ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్‌
ప్రజాశక్తి - దెందులూరు

                ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, తుపాను ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని తేమశాతం నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం దెందులూరు మండలంలోని కొవ్వలిలో ఎపి రైతు సంఘం నాయకులు పర్యటించి మాండూస్‌ ప్రభావంతో కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం రాసులను పరిశీలించారు. కల్లాల్లోని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వి.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేసి ప్రస్తుతం కొనుగోలు లక్ష్యం మేరకే రైతుల నుండి ధాన్యం సేకరిస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. రైతులు పండించిన ధాన్యం ఎక్కడికక్కడ కల్లాల్లో ఉండిపోయిందని చెప్పారు. గోనె సంచులు అందుబాటులో లేక, సంచులున్నా ధాన్యం రవాణాకు లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో నూతన విధానం రైతులకు మేలు చేస్తుందని చెప్పి ఆచరణలో అన్నదాతలను కష్టాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. రైతుల నుండి పూర్తిగా ధాన్యం సేకరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 12వ తేదీన విజయవాడలోని సివిల్‌ సప్లయీస్‌ కార్యాలయం వద్ద రాయబార కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మనరాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తేమ శాత నిబంధనలు సడలించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలన్నారు. ధాన్యం రవాణాకు లారీల కొరత నివారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గండి రాజా, సున్నా వెంకటరావు, రైతులు, కౌలు రైతులు కె.సురేష్‌, జి.వినరు, బి.బుజ్జి పాల్గొన్నారు.