May 04,2023 23:36

పిఠాపురం మండలం కందరాడలో నీటిలో నానుతున్న పనలను చూపుతున్న రైతులు

నిండా మునిగిన అన్నదాతలు
మొలకలు వస్తున్న ధాన్యం
కంటి తుడుపు చర్యలకే సర్కారు పరిమితం
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారు. అతి కొద్ది రోజుల్లోనే చేతి కొస్తుందనుకున్న పంట కళ్ళ ఎదుటే నీట నానుతుంది. అయినా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నష్టాన్ని తలచు కుంటూ విలవిలలాడుతున్నారు. వరుసగా నాలుగు రోజులు పాటు ఎడతెరిపి లేని వర్షానికి నేలను తాకి నానుతున్న పంట, తడిసి ముద్దయిన ధాన్యం రాశుల నుంచి వస్తున్న మొలకలను చూసి కన్నీళ్లు పెడుతుండగా వారిని అన్ని విధాల ఆదుకోవాల్సిన సర్కారు కంటి తుడుపు చర్యలకు మాత్రమే పరిమితం అవుతుంది.
కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో దాదాపు 140 గ్రామాల్లో అకాల వర్షాల ప్రభావం పడింది. దింతో భారీగానే రైతులు నష్టపోయారు. 1.63 లక్షల ఎకరాల్లో ఈసారి రబీ వేయగా సుమారు 80 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని, సుమారు 6 వేల ఎకరాల్లో కోయని వరి నేలను తాకిందని, 7 వేల ఎకరాల్లో వరి పనలపై ఉండగా తడిసి ముద్దయిందని, 7 వేల ఎకరాల్లో సుమారుగా 21 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కళ్ళల్లోనే ఉండిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి వారం, పది రోజుల్లోనే చేతికి అందివచ్చే పంట నీట మునిగిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవా నికి 20 వేల ఎకరాలకు పైనే నేలను తాకిన వరి ఎందుకూ పనికి రాకుండా పోయింది. కోసి పనులపై ఉన్న ధాన్యం మొత్తం మొలకలు వచ్చి నాశనమైం దని చెబుతున్నారు. పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులు రోడ్డు ప్రక్కల గుట్టలు గుట్టలుగా దర్శన మిస్తున్నాయి. ఆరబెట్టేందుకు కూడా అవకాశం లేకపోవడంతో తడిసి ముద్దయి సగం పంట మొలకలు వచ్చినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ధాన్యాన్ని తక్షణమే నిబంధనలను పక్కన పెట్టి కొనుగోలు చేయాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

కాలువల్లో పేరుకుపోయిన పూడిక
పలు పంట కాలవల్లో, డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడంతో అకాల వర్షాలతో రైతులకు నష్టాలు తప్పలేదు. వర్షపు నీరు పొలాల నుంచి బయటకు పోవడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. పేరుకుపోయిన పూడికను తొలగించక పోవడం తోనే నీరు నిలవ ఉండిపోయింది. దీంతో రైతులు తమ పంటలను కోల్పోవాల్సి వచ్చింది. పంట కాలువలు ఆధునీకరణ చేపట్టకు పోవడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
నిబంధనలను సడలించి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి సంబంధించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. నెలలు తరబడి ధాన్యం డబ్బులు పెండింగ్‌ లో ఉంచకుండా వారం రోజుల్లోనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆందోళనలు ఉదతం చేస్తాం.
వల్లు రాజబాబు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి

పూర్తిగా నష్టపోయా...
ఎకరంలో వేసిన పంట అంతా పూర్తిగా నష్టపోయాను. ధాన్యం మొలకలు రావడంతో రూ.45 వేలు వరకూ పెట్టిన పెట్టుబడి తుడిచిపెట్టుకు పోయింది. నా లాంటి రైతులకు అధికారులు ఎటువంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు.
కొత్తెం లోవరాజు, కౌలు రైతు, గోకివాడ, పిఠాపురం మండలం

తక్కువ ధరకు
అమ్ముకోవాల్సి వస్తుంది
ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాను. ధాన్యం రాశులు సగం పూర్తిగా తడిసి మొలకలు వచ్చాయి. ఆరబెడదా మంటే తెరిపి ఇవ్వడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను.ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదు.
పిల్లి దుర్గబాబు, రైతు, కోలంక,
కాజులూరు మండలం

మొలకలు వచ్చిన
ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ఎకరాకు రూ. 50 వేలు పెట్టుబడి పెట్టి 5 ఎకరాల్లో రబీ సాగు చేశాను. అకాల వర్షాలు నిండా ముంచెత్తాయి. ధాన్యం రాశులు తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయి. సగం పంట నాశనం అయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలి.
రెడ్డి చందర్రావు, కౌలు రైతు, కరప