May 29,2023 21:31

రోధిస్తున్న బాలుని బంధువులు

 

ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు భరత్‌ కుమార్‌ మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు సరస్వతి, నల్లగుట్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తేలుకాటుకు గురై చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరిన ఆస్పరి మండలం అలిగేర గ్రామానికి చెందిన భరత్‌ కుమార్‌ కోలుకోక సోమవారం మృతి చెందాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ఆదివారం పొలంలో తేలుకాటుకు గురైన భరత్‌ కుమార్‌ను హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చామన్నారు. విధుల్లో ఉన్న నర్సు, వైద్యులు పట్టించుకోలేదన్నారు. కళ్లెదుటే గిలగిలా కొట్టుకుంటున్నాడని, ఏదైనా చికిత్స చేయాలని కాళ్లావేళ్లా పడినా తమ పట్లనే దురుసుగా ప్రవర్తించారని వైద్యుల తీరుపై మండిపడ్డారు. బాలుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, వైసిపి నాయకులు జయ మనోజ్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆస్పత్రి సందర్శించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నా నిర్లక్ష్యం చేయడమేమిటని వారు వైద్యులపై మండిపడ్డారు. తమ కుమారుడు చనిపోయిన అనంతరం ఆక్సిజన్‌ పెట్టారని, తమకు అన్యాయం జరిగిందని మృతి చెందిన బాలుడు బంధువులు వారి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రాత్రి వేళలో పరీక్షించాల్సింది పోయి కర్నూలు వెళ్లాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ కనీసం సెలైన్‌ బాటిల్‌ కూడా ఎక్కించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తేలుకాటు విషం మత్తులో ఉండగానే ఇడ్లీ తినిపించాలని చెప్పారని తెలిపారు. ఆస్పత్రిలో కోలుకోక మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరిగిందని, డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత డాక్టర్‌పై చర్య తీసుకుంటామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింగన్న చెప్పారు. వైద్యుల తీరు మారకపోవడంతో వారిపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.