ప్రజాశక్తి - ఆదోని
తేలు, పాముకాటుతో చిన్నారులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదోని ఏరియా ప్రభుత్వాస్పత్రిలో కొందరు వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, అంకితభావంతో వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. వైద్యులను క్రమపద్ధతిలో పెట్టాల్సిన పాలకులు, ఉన్నతాధికారులు మెతక వైఖరి అవలంభిస్తుండడం వల్ల రాత్రి వేళల్లో విధులకు డుమ్మా కొడుతున్నారని రోగులు చెబుతున్నారు.
డివిజన్ కేంద్రమైన ఆదోని ఏరియా ఆస్పత్రికి ఆలూరు, హోళగుంద, కోసిగి, కౌతాళం, ఆస్పరి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలకు చెందిన ప్రజలు వస్తుంటారు. ఇక్కడ వసతులు లేకపోవడంతో పరీక్షలు చేయకుండానే కర్నూలుకు రెఫర్ చేస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించడం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తీవ్రంగా గాయపడి, తీవ్రత పెరిగి కోలుకోలేక కొందరు రోడ్డు మార్గంలోనే మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా మానవత దృక్పథంతో వ్యవహరించి ఆదోని ఏరియా ప్రభుత్వాస్పత్రి పేరు ప్రతిష్టలు మసకబారకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వరుస మరణాలు : తేలు, పాముకాటుతో పక్షం రోజుల్లోనే ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి సకాలంలో తీసుకొచ్చినా సరైన వైద్యమందక మృతి చెందారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈనెల 2న ఆస్పరి మండలం అలిగేర గ్రామానికి చెందిన భరత్ కుమార్ తేలుకాటుకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. సరైన మందులు, చికిత్స అందక ఆస్పత్రిలోనే మృతి చెందడంతో వివాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంపై చిన్నారి బంధువులు మండిపడ్డారు. ఈ ఘటన మరువకముందే ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన హైమావతి అనే బాలిక పాముకాటుకు గురైంది. ఆస్పత్రికి తీసుకురాగా కోలుకోలేక మృతి చెందిందని బంధువులు తెలిపారు. ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నా, సకాలంలో ఇవ్వకపోవడంతో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
మారని తీరు : ఆస్పత్రిలో కనీస సదుపాయాలపై కలెక్టర్ డాక్టర్ సృజన గత నెలలో తనిఖీలు చేశారు. అక్కడ టాయిలెట్, బాత్‌రూం, సమస్యలపై ఆస్పత్రి వర్గాలపై మండిపడ్డారు. ఆమె సూచన మేరకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆస్పత్రిలో తనిఖీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆస్పత్రిని సందర్శించి పనులను పర్యవేక్షించారు. అయినా తీరు మారకపోవడంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులునా ఖర్చు చేయని పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు. నామమాత్రంగా నెలకోసారి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరుగుతూనే ఉంది. సమస్యలు అలానే ఉండడంతో అర్థం కావడం లేదని రోగులు వాపోతున్నారు.
ఆస్పత్రికి ఆలస్యంగా వస్తున్నారు
- డాక్టర్ లింగన్న, ఆస్పత్రి సూపరింటెండెంట్
తేలు, పాముకాటుకు గురైన వారు హుటాహుటిన ఆస్పత్రికి రావడం లేదు. నాటువైద్యం తీసుకుంటూ విషం శరీరంలోకి వ్యాప్తి చెందే వరకు ఉంటున్నారు. చికిత్స చేసినా కోలుకోక మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలో పాము, తేలు, కుక్కకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా త్వరగా ఆస్పత్రికి వచ్చి మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా వైద్యులపై నిందలు వేయవద్దు.
మృతి చెందిన భరత్ కుమార్ (ఫైల్)










