Jun 20,2023 00:40

విజ్ఞాన కేంద్ర నిర్మాణానికి నగదు అందజేస్తున్న బాపయ్య చౌదరి

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి (బాపు) తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. మండల కేంద్రమైన పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో నిర్మాణం కమిటీ కార్యదర్శి కె.నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సభలో... విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి నాట్స్‌ తరఫున బాపయ్య చౌదరి రూ.5.5 లక్షల విరాళాన్ని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, విజ్ఞాన కేంద్రాల జిల్లా కన్వీనర్‌ పాశం రామారావుకు అందించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రాలు రాష్ట్రంలో బహుముఖ సేవా కార్యక్రమాలకు, యువతకు విద్య, మహిళల స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పెదనందిపాడులో ఏర్పాటు కాబోతున్న ఈ విజ్ఞాన కేంద్రం ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడబోతుందని అన్నారు. బాపయ్య చౌదరి మాట్లాడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అమెరికాలోనూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ప్రత్యేకంగా మన గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ క్రమంలోని కంటి వైద్య శిబిరాలు, స్కాలర్‌షిప్‌లు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన గ్రామం - మన బాధ్యత అనే నినాదంతో విదేశాల్లోని తెలుగువారిలో స్ఫూర్తి కలిగిస్తూ వారు కూడా తమ గ్రామాల అభివృద్ధికి సహకరించేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కె.హరిబాబు, ఎన్‌.ఆచారి, మాజీ ఎంపిపి ఎన్‌.బాలకృష్ణ, పిఎఎస్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వీరరాఘవయ్య, వి.రమణ, కె.వెంకట సుబ్బారావు, డి.రమేష్‌, డి.వెంకట సుబ్బారావు, జి.మోహన్‌రావు, ఎస్‌.అంకారావు, కె.శ్రీనివాసరావు, జె.రామారావు పాల్గొన్నారు.
గురువుకు సత్కారం
తనకు ఓనమాలు నేర్పిన మొదటి గురువు తమలపాకుల సుబ్బారావు మాస్టారును తన మిత్రులతో కలసి బాపయ్యచౌదరి సత్కరించారు. తన అక్క, కుమార్తె కూడా ఆయన దగ్గర చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు. వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన మహోన్నత వ్యక్తి సుబ్బారావు మాస్టారు అని అన్నారు. కార్యక్రమంలో బాపు మిత్రులు దాసరి సుబ్బారావు, కాకుమాను నాగేశ్వరరావు, దాసరి రమేష్‌, తెలగతోటి రాజబాబు, శీలం అంకారావు పాల్గొన్నారు.