ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్: అకాల వర్షాల వల్ల తడిసిన మొక్కజొన్న, మిర్చి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, సీనియర్ నాయకులు కాకనబోయిన లింగారావు డిమాండ్ చేశారు. మండలంలోని షేర్ మహమ్మద్ పేట, రామచంద్రుని పేట, రావికంపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని కల్లాలలో రైతులు ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న పంటలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మిర్చి పంటకు ఒక ఎకరానికి 1.25 లక్షల రూపాయలు, మొక్కజొన్న పంటకు 35 వేల రూపాయలు వరకు రైతులు పెట్టుబడి పెట్టారని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలను అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జగ్గయ్యపేట తాసిల్దార్ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ గౌస్ మియా, కోట కృష్ణ, ఎస్.రామనాథం, జె.వెంకటరావు, మీరాసాహెబ్, రామచంద్రుని పేట గ్రామ సర్పంచ్ మద్దుల రామకృష్ణ, రైతులు యర్రంశెట్టి శ్రీనివాసరావు, సుక్క ప్రసాద్, సుక్క శ్రీనివాసరావు, ఆరెగడ్డ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










