ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం పాలవలస గ్రామంలో జివిటి స్మార్ట్ టౌన్‌షిప్ పేరిట శనివారం రెవెన్యూ అధికారులు అక్రమంగా మామిడి తోటలను తొలగించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. పాలవలస రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 80/3లోని సుమారు 30 ఎకరాల్లో 30 మంది రైతులు మామిడి తోటలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జివిటి స్మార్ట్‌్ టౌన్‌షిప్ కోసం ప్రభుత్వం స్థల సేకరణకు సిద్ధమైంది. దీన్ని రైతులు వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ అధికారులు ప్రోక్లెయినర్‌తో వెళ్లి పాలవలస అప్పలకొండ కుమారుడు శంకర్‌కు చెందిన ఎకరా భూమిలోని మామిడి తోటలను తొలగించారు. దీంతో రైతులందరూ సంఘటనా స్థలానికి చేరుకొని కోర్టులో కేసు ఉండగా అక్రమంగా స్వాధీనం చేసుకోవడం తగదని రెవెన్యూ అధికారులను నిలదీశారు. తాము ల్యాండ్ పూలింగ్ పేరిట భూములు ఇవ్వబోమని పాలవలస శంకర్ స్పష్టంచేశారు. దీనిపై తహశీల్దార్‌ను ప్రజాశక్తి రైతుల ఇష్టంతోనే ల్యాండ్ పూలింగ్ చేపట్టామని, దరఖాస్తులు తీసుకున్న తర్వాతనే సంబంధిత భూముల్లోకి వెళ్లామని చెబుతున్నారు. ఈ చెట్లు తొలగించిన స్థలానికి సంబంధించి కోర్టులో ఎటువంటి కేసూ లేదని తహశీల్దార్ రామారావు చెప్పారు.










