ప్రజాశక్తి-అడ్డతీగల
అడ్డతీగల మండలంట వీరవరం పంచాయతీ చాకిరేవుల గ్రామంలో అంగన్వాడీ మినీ వర్కర్‌గా పనిచేస్తున్న బోడగా సత్యవతి (35) టైఫాయిడ్, పచ్చ కామెర్లతో కాకినాడ జిజిహెచ్‌లో మంగళవారం సాయంత్రం మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.... సత్యవతికి ఎనిమిది రోజుల క్రితం జ్వరం రావడంతో అడ్డతీగల సిహెచ్‌సికి వెళ్లగా రక్త పరీక్షలు చేశారు. అందులో టైఫాయిడ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యం అందించారు. మూడు రోజులపాటు వైద్యం చేసినా ఆమె పరిస్థితి కుదుటపడకపోవడంతో కాకినాడ జిజిహెచ్‌కి రిఫర్ చేశారు. రక్తపరీక్షలు చేయగా టైఫాయిడ్, పచ్చకామెర్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. ప్లేట్లెట్స్ పడిపోవడంతో పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సత్యవతి భర్త వెంకటేశ్వరరావు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ పదవ తరగతి, రెండవ కుమారుడు జాన్ విక్టర్ 9వ తరగతి చదువుతున్నారు. సత్యవతి మృతి పట్ల అడ్డతీగల సిడిపిఓ దీప్తి సంతాపం వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల, సిఐటియు మండల అధ్యక్షుడు గుల్లల సురేష్ బాబు, సిఐటియు రాష్ట్ర నాయకులు పి రామరాజు సత్యవతి మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు.










