Aug 18,2023 21:11

నిరసన ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులు, నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ఎన్‌ఎంఆర్‌, డైలీ వేజెస్‌, ఫుల్‌ టైం, పార్ట్‌ టైం సిబ్బంది సర్వీస్‌ లను క్రమబద్ధీకరించాలని టైం స్కేల్‌ ఉద్యోగులు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం పట్టణంలో సత్యమ్మ గుడి సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ మూడు దశాబ్దాల తర్వాత సర్వీస్‌ గల వారిని క్రమబద్ధీకరణ కు సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 ఏళ్లుగా మినిమం స్కేల్‌ క్రింద పనిచేస్తున్న తమని క్రమబద్ధీకరిస్తున్నామని ప్రకటించకపోవడం దారుణమన్నారు. తమకంటే వెనుక వచ్చిన వారిని క్రమబద్ధీకరిస్తూ తమకు అన్యాయం చేయడం బాధాకరమన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమను కూడా క్రమబద్ధీకరించి ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ అరుణ్‌ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టైం స్కేల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోవిందప్ప, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, ఉపాధ్యాయుడు వేమయ్య, కోశాధికారి లక్ష్మీనారాయణ, ఎస్‌టి వెల్ఫేర్‌ సిబ్బంది రామకృష్ణ, రంగే నాయక్‌, రమణప్ప, కృష్ణ నాయక్‌, బీసీ వెల్ఫేర్‌ సిబ్బంది ప్రభాకర్‌, సోము, హిదయతుల్లా, భాగ్యమ్మ, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.