Nov 20,2023 21:48

సత్తా చాటిన క్రీడాకారులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం : రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయబావుటా ఎగురవేశారు. పతకాల పంట పండించి సత్తా చాటారు. గుంటూరు జిల్లా తెనాలి వేదికగా ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్న జిల్లా క్రీడాకారులు మొత్తం 13 పతకాలు సాధించి శభాష్‌ అనిపించారు. ఇందులో నాలుగు స్వర్ణ, రెండు రజత, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పోటీలను ముగించుకుని జిల్లా క్రీడాకారుల బృందం సోమవారం జిల్లాకు చేరుకుంది. రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించడంపై ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, ముఖ్య సలహాదారు పి.సుందరరావు, తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌ కొమర భాస్కరరావు, పిఇటి సంఘ నాయకులు ఎం.వి రమణ, జిల్లా ఉషు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్‌, ఇస్కాఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నర్సింహులు తదితరులు అభినందించారు. జాతీయ పోటీలకు ఇదే స్ఫూర్తితో సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా తైక్వాండో బృందానికి కోచ్‌ మేనేజర్లుగా కె.తారకరామ, లక్ష్మణరావు, ముద్దాడ శిరీష వ్యవహరించి మెప్పించారు. డెహ్రాడూన్‌లో జాతీయ పోటీలు నిర్వహించనున్నట్లు కొమర భాస్కర్‌ వెల్లడించారు.