May 07,2023 01:04

పెద్ద గుండం పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు

- పెద్ద గుండం కు టైడల్‌ గేట్‌ ఏర్పాటు చేయాలి
- కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
ప్రజాశక్తి- తాళ్లరేవు
పి. మల్లవరం పంచాయతీ పరిధిలోని పెద్దగుండంలోకి పోటు సమయంలో ఉప్పునీరు రాకుండా ఉండడానికి గుండం శివారు టైడల్‌ గేట్‌ ఏర్పాటు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోర్త రాజశేఖర్‌ , వళ్లు రాజబాబు డిమాండ్‌ చేశారు. శనివారం పి. మల్లవరం పెద్దగుండంను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మట్టపర్తి సూర్యనారాయణ, చిట్టూరి శ్రీనివాస్‌, మట్టపర్తి సుబ్బారావు, దడాల వెంకటేశ్వరరావు వీరితో మాట్లాడారు. ఆటు పోట్ల ద్వారా మందార కాలువ నుంచి పోటు సమయంలో పెద్దగుండంలోకి ఉప్పునీరు ప్రవేశించడం ద్వారా ఆ ఉప్పు నీరు పంట పొలాల్లోకి వచ్చి దిగుబడి తగ్గిపోతుందని వాపోయారు. అకాల వర్షాల సమయంలో పత్తి గొంది ప్రాంతం నుంచి గుండంలోకి దిగుతున్న ముంపు నీరు, మందార కాలువ పోటు నీరు ఎగదన్ని మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనివల్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయి ఆరుగాలం పండించిన పంట కుళ్ళిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని కషి చేస్తామని కౌలు రైతు సంఘం నాయకులు రైతులకు తెలిపారు.
పెద్దగుండంలో గుర్రపు డెక్క తొలగింపు పనులు
ప్రజాశక్తి వార్తకు స్పందన
గండంగా మారిన పెద్దగుండం శీర్షికన ప్రజాశక్తిలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. అకాల వర్షాల కారణంగా పంట చేల నుంచి ముంపు నీరు దిగడానికి అవకాశం ఉన్న పెద్దగుండం పూర్తిగా గుర్రపు డెక్కతో మూసుకుపోవడంతో రైతుల ఇబ్బందులను ప్రజాశక్తి ప్రచురించింది.దీంతో పి.మల్లవరం పెద్దగుండంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 300 మీటర్లు మేరా పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించడానికి ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సూరంపూడి వెంకటరమణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మోకన నూర్యమని పెద్దగుండం ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సూర్య మణి మాట్లాడుతూ మండల స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పెద్దగుండంలో 300 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో మూడు వారాలపాటు ఉపాధి కూలీలకు సుమారు 1100 పని దినాలు కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక రైతులు మట్టపర్తి సూర్యనారాయణ, చిట్టూరి శ్రీనివాస్‌, మట్టపర్తి సుబ్బారావు ,దడాల వెంకటేశ్వరరావు, దంగేటి విగేశ్వర రావు, దున్న మేరా సాహెబ్‌ పాల్గొన్నారు.