Apr 25,2021 17:28

'తాతయ్యా! ''ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల'' అంటారు కదా! అసలు అవి ఏంటో వివరంగా చెప్పవా?' అని అడిగారు రాము, సోము, ప్రసాద్‌, ప్రణవి.
'అలాగేరా..! మీకు చెప్పడం కాదు చూపించి వివరిస్తా. మీరంతా రెడీ అవ్వండి. మన ఊరు వెళదాం!' అన్నాడు తాతయ్య.
ఆ మాటలకు పిల్లలు సరేనంటూ తలూపారు. పట్టణానికి దగ్గరలో ఉన్న రామాపురం అనే గ్రామం తాతయ్యది. అక్కడ చుట్టూ పంట పొలాలు, కొబ్బరిచెట్లు, మామిడి తోటలు, చెరువులు, కాలువలు ఉంటాయి. కొన్ని గంటల్లోనే అందరూ గ్రామానికి చేరుకున్నారు.
నానమ్మ నవ్వుతూ ఎదురొచ్చి, పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లింది.
కొంతసేపు విశ్రాంతి తర్వాత 'పిల్లలూ రెడీనా? ఇక మన పాఠం నేర్చుకుందాం' అంటూ నవ్వుతూ వచ్చాడు తాతయ్య.
'రెడీ తాతయ్యా' అంటూ అందరూ తాతయ్య వెంట నడవసాగారు. ముందుగా తోటకు వెళ్లారు. అక్కడొక చీమల పుట్ట చూపించాడు తాతయ్య.
'పిల్లలూ ఈ చీమల పుట్ట చూడండి. చీమలు ఏం చేస్తున్నాయో గమనించండి' అన్నాడు తాతయ్య.
పిల్లలంతా చీమల పుట్ట వంక చూడసాగారు. చీమలు వరసగా బయటకు వచ్చి, ఒకే లైనులో చాలాదూరం వెళ్ళాయి. తిరిగి నెత్తిమీద ఏదో పెట్టుకుని వచ్చి, పుట్టలోకి వెళ్లాయి. ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నారు పిల్లలు.
'చీమల్ని గమనించారా?' అడిగాడు తాతయ్య.
'ఆ.. ఆ.. తాతయ్య' అన్నారు పిల్లలు.
'చీమల్లో ఎర్రవి, నల్లవి ఉంటాయి. అవి చాలా కష్టపడి పనిచేస్తాయి. రోజూ బయటకెళ్లి ఆహారాన్ని సంపాదించుకుని, తమ పుట్టలో దాచుకుంటాయి. అవి బయటకు వెళ్ళలేని సమయంలో అంటే వర్షాకాలంలో దాచుకున్న ఆహారం తింటాయి. ఇలా సంపాదించి, దాచుకోవడమే ''పొదుపు'' అంటారు. పొదుపులో చీమలు మనకు ఆదర్శం!' అన్నాడు తాతయ్య.
తర్వాత తాతయ్య పక్కనే ఉన్న పూలతోటకి తీసుకెళ్లాడు. అక్కడ గులాబీ, మల్లెపువ్వు, కనకాంబరంలాంటి పూల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి పువ్వు చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. 'ఇక్కడ ఇంకొక పాఠం నేర్పుతా! జాగ్రత్తగా గమనించండి. పువ్వుల మీద తుమ్మెదలు తిరుగుతున్నాయి. అలికిడి చేస్తే ఎగిరిపోతాయి సుమా!' అన్నాడు తాతయ్య.
పిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తుమ్మెదలు ఝూంకారాలు చేస్తూ పువ్వుల మీద వాలుతున్నాయి. తమ పొడవాటి నోటి గొట్టంతో పువ్వులలోని మకరందాన్ని సంగ్రహిస్తున్నాయి. పిల్లలు అంతా గమనిస్తూ ఉన్నారు. ఒక పువ్వు తరువాత మరొక పువ్వు ఇలా తమ రెక్కల శబ్ధం చేసుకుంటూ అన్ని పువ్వులపై వాలుతున్నాయి తుమ్మెదలు. 'పిల్లలూ చూశారా ''ఓర్పు'' అంటే ఇది. తుమ్మెదలు పువ్వులను నొప్పించకుండా వాటిలోని తేనెను తాగుతున్నాయి. పైగా వాటి రెక్కల శబ్దంతో పువ్వులకి ఆనందం కలిగిస్తున్నాయి' అన్నాడు తాతయ్య.
కొద్దిసమయం తర్వాత పక్కనే ఉన్న పాడుపడిన పాక దగ్గరకు తీసుకెళ్లాడు తాతయ్య పిల్లలని. 'ఈ సాలెపురుగు గూడును కడుతోంది. గమనించండి!' అంటూ అటువైపు చూపాడు. అంతలోనే గాలికి గూడు తెగి, సాలీడు కింద పడిపోయింది. అయినా మరలా నిలదొక్కుకుని, గూడును కడుతోంది. ఇలా చాలాసార్లు జరిగింది. అయినా ఏమాత్రం విసుగు, విరామం లేకుండా గూడుని కడుతూనే ఉంది. 'చూశారా ''పట్టుదల'' అంటే ఇది. పట్టుదలకు మనం ఈ సాలీడుని ఉదాహరణగా తీసుకోవచ్చు!' అన్నాడు తాతయ్య.
'అక్కడొక తాడిచెట్టుకు పిచ్చుకగూళ్ళు వేలాడుతున్నాయి చూశారా! పిట్టలు కట్టుకునే ఆ గూళ్లల్లో మన ఇళ్లలో మాదిరి గదులూ ఉంటాయి. అది ''నేర్పు'' అంటే' అన్నాడు తాతయ్య.
పిల్లలంతా ఒక్కసారి చప్పట్లు కొట్టారు. ''భలే భలే తాతయ్య.. ''ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల'' అంటే ఏంటో మాకు చూపించావు. ఇంత చక్కగా పాఠాలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు?' అన్నారు పిల్లలు.
గల గల నవ్వాడు తాతయ్య మీసం తిప్పుతూ.

- కూచిమంచి నాగేంద్ర
9182127880