Sep 23,2023 18:44

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
   మండలంలోని తాటియాకులగూడెంలో ఇటీవల జ్వరాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో భాగంగా ఇంటింటా సర్వే నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ లాంటి విష జ్వరాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరుగుతూ వారి ఆరోగ్య వివరాలు సేకరించారు. ఇళ్ల పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రజారోగ్య దృష్ట్యా గ్రామంలో పలువురికి పలు రకాల పరీక్షలు నిర్వహించారు. అనంతరం పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించి, దోమల నివారణకు మలాథీయన్‌ మందు పిచికారి, ఫాగింగ్‌ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి పెద్దిరాజు, ఇఒపిఆర్‌డి నిఖిల్‌ మధు చరణ్‌, కార్యదర్శి వీరలక్ష్మీ, ఎఎన్‌ఎం ఆదిలక్ష్మి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.