Apr 17,2023 20:57

తాటి నుంజలు అమ్ముతున్న దృశ్యం

తాటి నుంజలతో వేసవి ఉపశమనం
ప్రజాశక్తి - బనగానపల్లె

     వేసవికాలం ప్రారంభం నుండే భానుడి విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఎండ తీవ్రతో పాటు వడగాలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాటి నుంజలను ఆశ్రయిస్తున్నారు. బనగానపల్లె మండలంలోని చిన్న రాజుపాలెం, క్రిష్ణగిరి తాటి వనం నుండి, అవుకు మండలంలోని అవుకు రిజర్వాయర్‌ ప్రాంతం నుండి తాటి నుంజలను తెచ్చి బనగానపల్లె పట్టణంలో అమ్ముతున్నారు పట్టణంలోని పాత బస్టాండ్‌, కూరగాయల మార్కెట్‌, మైనర్‌ ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ,పెట్రోల్‌ బంకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ల వద్ద తాటి కాయలను తెచ్చి నుంజలను తీసి అమ్ముతున్నారు. వీటితోపాటు నీడను ఇచ్చే చెట్ల కింద తాటి నుంజల వ్యాపారం పట్టణంలో జోరుగా సాగుతుంది. ఐస్‌ యాపిల్‌గా పేరుగాంచిన నుంజలు వేసవికాలంలో శరీరానికి చలువ చేయడంతో పాటు అజీర్తిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి. పారదర్శకంగా జెల్లిలా జారిపోయే వీటిని తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. డజన్‌ 70 రూపాయల చొప్పున అమ్ముతుండడంతో ప్రజలు అధికంగా తాటి మంజులను కొనుగోలు చేసి వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. ప్రజలకు తక్కువ రేటుకు లభిస్తుందడం, అప్పటికప్పుడే కాయల నుంచి నుంజలను తీసి ఇస్తుండడంతో అందరూ కొనుగోలు చేస్తున్నారు. తాటి నుంజల వ్యాపారం చేసుకునే వారికి కూడా రోజుకు ఖర్చులు పోను 600 నుండి 800 రూపాయలు మిగులుతున్నట్లు చిన్న రాజుపాలెం గ్రామానికి చెందిన కృష్ణానాయక్‌ తెలిపారు. ప్రజలకు వేసవి తాపాన్ని తీరుస్తున్న తాటి నుంజలు కూలి పని చేసుకుని అమ్ముకునే వారికి కూడా గిట్టుబాటు అవుతున్నాయి. దీంతో పట్టణంలో తాటి నుంజల వ్యాపారం జోరుగా సాగుతుంది.