Apr 11,2023 00:17
తాటి ముంజలు విక్రయిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-సంతమాగులూరు: వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే తాటి ముంజలకు గిరాకీ పెరిగింది. ప్రతి ఏడాది సంతమాగులూరు, అడ్డ రోడ్డు జంక్షన్‌ గ్రామాల మధ్యలో రహదారికి పక్కనున్న చెట్ల కింద 20 మందికి పైగా వ్యాపారులు తాటికాయలు తెచ్చి, కాయ ఒకటి పది రూపాయల చొప్పున విక్రయించేవారు. ఈ ఏడాది ఒకరిద్దరు తప్ప తాటికాయలు అమ్మేవారు కనబడటం లేదు. రహదారుల వెంట ఉన్న తాటిచెట్లను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తొలగించి, ఆ భూములపై వెంచర్లు వేయడంతో తాటి చెట్లు కనుమరుగవుతున్నాయి. దీంతో వ్యాపారులు సుదూర ప్రాంతం వెళ్లి అధిక ధరలతో తాటికాయలను కొనుగోలు చేయవలసి వస్తుందని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ఖర్చులు పెరగటంతో తాటి ముంజలకు గిరాకీ పెరిగిందని వారు తెలుపుతున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తాటికాయ 20 రూపాయలు పలుకుతోంద న్నారు. దీంతో వినియోగదారులు తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.