* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: శాంతిభద్రతల పరిరక్షణలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సేవలు కీలకమని ఎస్‌పి జి.ఆర్ రాధిక అన్నారు. స్థానిక ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు మైదానంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి జంగిల్ షూస్‌ను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అమోఘమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో కొన్నిచోట్ల అనుకోని పరిస్థితుల్లో ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన సందర్భంలో స్థానిక పోలీసులున్నా, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో టాస్క్‌ఫోర్స్ పాత్ర కీలకమన్నారు. రథసప్తమి, శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానాలు వంటి వేలాది మంది యాత్రికులు వచ్చినప్పుడు ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహించడంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అవసరమన్నారు. ప్రతిఒక్కరూ మరింత క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి డి.ప్రసాదరావు, ఆర్‌ఐ ఉమామహేష్ సిబ్బంది పాల్గొన్నారు.










