తాత్కాలిక రహదారికి నిధులు మంజూరుపై సిపిఎం కృతజ్ఞతలు
ప్రజాశక్తి-కూనవరం
మండలంలోని గండికొత్తగూడెం గ్రామానికి తాత్కాలిక రహదారికి నిధులు మంజూరు చేయడంపై ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిని గురువారం సిపిఎం నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాశ్వతంగా తారు రోడ్డు నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య మాట్లాడుతూ రోడ్డు సరిగా లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన పలు ధర్నాలు, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. తమ కృషి ఫలితంగా ఇటీవల నిధులు మంజూరు చేశారని తెలిపారు. తాత్కాలికంగా రహదారి వల్ల సమస్య పునరావృతం అవుతుందని, దానికి శాశ్వత పరిష్కారంగా తారు రోడ్డు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెదర్కూర్ సర్పంచ్ మడకం నాగమణి, మాజీ ఎంపీటీసీ మేకల నాగేశ్వరరావు, తమ్మయ్య, లచ్చయ్య, సిపిఎం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










