మన సమిష్టి జాతీయ స్ఫూర్తి ఎంత బలహీనంగా ఉందో, ఎంత అభద్రతతో ప్రభుత్వం ఉన్నదో విదేశాంగ మంత్రి, ఆయన సహచరులు పెట్టిన ట్వీట్లు వెల్లడిస్తున్నాయి. మన పిరికిపంద సెలబ్రిటీల మాదిరిగా కాకుండా ఆ బార్బడోస్ గాయని స్వేచ్ఛగా, స్వతంత్రమైన వ్యక్తిగా తన భావాలను ఉన్నవాటిని ఉన్నట్టు వెల్లడించింది. దానికి ప్రభుత్వం, పాలక పార్టీ ప్రతిస్పందించిన తీరే దురుద్దేశపూర్వకంగా ఉంది. ఆ ప్రతిస్పందనలో ఆత్మవిశ్వాసం ఎక్కడా కనపడలేదు సరికదా, చిత్తభ్రమ కూడా వ్యక్తం అవుతోంది.
మొన్న (2.2.21) రాత్రి మన బలమైన, భద్రంగా ఉన్న, స్వంత కాళ్ళ మీద నిలబడగలిగిన మేరా భారత్ మహాన్ - ఒక్క ముక్కలో చెప్పాలంటే- మన ఆత్మనిర్భర భారతం-బ్రహ్మాండంగా ఉందన్న నిశ్చింతతో నేను హాయిగా నిద్రపోయాను. తీరా తెల్లవారి లేచి చూతును కదా...మన భద్రత, మన స్వావలంబన యావత్తూ ఒక విదేశీయురాలి ఒకే ఒక ట్వీట్ దెబ్బకు పునాదులతో సహా కదిలిపోయిందని గమనించాను. అయితే, మళ్ళీ నిన్న సాయంత్రానికి నా భయాలూ, ఆందోళనలూ కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఎల్లప్పుడూ నిజాలను మాత్రమే ప్రవచించే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి విడుదలైన ఓ ప్రకటన, ఎప్పటికీ గౌరవనీయుడైన మన హోం మంత్రి గారు చేసిన ఓ ట్వీట్, అన్నిటికీ మించి మహా ఘనత వహించిన, దార్శనికత గలిగిన రాజకీయ సిద్ధాంతవేత్తలు అక్షరు కుమార్, సచిన్ టెండూల్కర్ వెలిబుచ్చిన గంభీరమైన భావాలు నాకు నిబ్బరాన్ని కలిగించాయి. దాంతో మన దేశ గౌరవం, స్వావలంబన చెక్కుచెదరకుండా ఉన్నాయన్న ధైర్యం నాకు కలిగింది. నిన్న రాత్రి నిశ్చింతగా నిద్రపోయాను.
నేను మామూలుగా ఎప్పుడూ వెటకారంగా మాట్లాడను. అది నా నైజమూ కాదు. కాని మన ప్రభుత్వం, దానికి దన్నుగా ఉండే దద్దమ్మలు ... రిహాన్నా అనే ఒక మహిళ చేసిన ఓ చిన్న ట్వీట్ కి ప్రతిస్పందించిన తీరు చూస్తే మాత్రం... వ్యంగ్యంగాను, వెటకారంగాను మాట్లాడితేనే న్యాయంగా ఉంటుందనిపిస్తోంది. వాళ్ళ ప్రతిస్పందన వంచనాపూరితంగా, ఏమాత్రమూ నిజాయితీ లేకుండా ఉండడమే కాదు. వాళ్ళు ఉచితానుచితాలను కూడా కోల్పోయారు. ఇప్పుడు మన జాతీయతా స్ఫూర్తి ఎంత బలహీనమైన భుజస్కందాల మీద నిలబడి వున్నదో మన దేశ గౌరవం గురించి, ప్రజల సంఘీభావం గురించి, పట్టుదల గురించి కూడబలుక్కుని వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు వెల్లడిస్తున్నాయి.
'మంచి'కి అంతిమ వీడ్కోలు పలుకుతూ 'చెడు' చెప్పేదానినే 'వంచన' అంటారని 17వ శతాబ్దపు ఫ్రెంచి రచయిత 'లా రాష్ ఫౌకాల్డ్' చెప్పిన మాట చాలా ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుత సందర్భానికి ఈ సుభాషితం అతికినట్టు సరిపోతుంది. 2020 అమెరికన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశపు వ్యవహారాల్లో చాల ఎక్కువగా తల దూర్చి భారతీయ మూలాలున్న అమెరికన్ ఓటర్లను డొనాల్డ్ ట్రంప్‌కు ఓట్లు వేయమని చెప్పాడు. దశాబ్దాల తరబడి మన దేశ ప్రధానులు అక్కడి అన్ని పార్టీలకూ సమ దూరం పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ విధానానికి నీళ్ళొదిలారు. ఇంతకన్నా తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. ఇది తీవ్రంగా బెడిసికొడుతుంది కూడా. భారత దేశంలో రైతులు సాగిస్తున్న నిరసనోద్యమం గురించిన ప్రచురితమైన ఒక వ్యాసాన్ని బార్బడోస్ కు చెందిన ఒక గాయని ప్రస్తావించడమే అనవసర జోక్యం అయితే అమెరికన్లు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలో ఒక భారతదేశ ప్రధాని చెప్పడం అంతకన్నా మితిమీరిన, అనవసర జోక్యం కాదా? ఆ రోజున హ్యూస్టన్‌లో ట్రంప్ పక్కనుండగా మోడీ ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకుంటే, ఇక ఏ విదేశీయుడినీ అనవసర జోక్యం అంటూ విమర్శించే హక్కే మనకు లేదని స్పష్టం అవుతుంది.
ఇక మన హోం మంత్రి చేసిన ట్వీట్ ప్రభుత్వపు వంచనా శిల్పానికి అద్దం పడుతుంది. పాలక పార్టీ యొక్క ఐ.టి సెల్‌ను ఏర్పాటు చేసినదీ, దానిని పర్యవేక్షించేదీ ఆ పెద్దమనిషే. వాస్తవాలను తలకిందులు చేయడంలో, వక్రీకరించడంలో అందెవేసిన చెయ్యి. అటువంటి వ్యక్తి ''ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని'' ఇతరులపై ఆరోపించడం అంటే గురివిందగింజ సామ్యమే గుర్తుకొస్తోంది. మతం, కులం భాష, ప్రాంతం పేర విభేదాలను, విద్వేషాలను రెచ్చగొట్టి ఆ విద్వేషాల మధ్య పైకెదిగిన రాజకీయ నాయకుడు ఇప్పుడు దేశం ఐక్యంగా ఉండాలని ప్రబోధించడం చూస్తే ''దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు'' అనిపించడంలేదూ.
ఇంకోపక్క మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటన మొదలుపెట్టడమే ఒక అబద్ధంతో మొదలైంది. పార్లమెంటులో పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే వ్యవసాయ చట్టాలు ఆమోదించబడ్డాయట! వాస్తవానికి వ్యవసాయ రంగంలో తీవ్ర మార్పులకు దారి తీసే ఈ చట్టాలను ముందు రాష్ట్రాలలో చర్చించి వుండాలి. అలా చేయలేదు. వీటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపివుండాలి. అదీ జరగలేదు. ఈ పద్ధతులను లెక్కచేయకపోవడమే కాదు, మోడీ ప్రభుత్వం మరీ బరితెగించింది. రాజ్యసభలో ఓటింగ్ పెట్టడానికి, అనుకూలురెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో లెక్కించడానికి నిరాకరించింది. ఇది పార్లమెంటును అపహాస్యం చేయడమేనని, ఈ బిల్లుల్లో మంచి, చెడు ఏమిటన్నది చర్చ జరిగేబదులు కేవలం మందబలంతో ఆమోదింప జేసుకున్నారని ప్రతాప్ భాను మెహతా అప్పుడే రాశారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్కడితోనే పరిమితం కాలేదు. ప్రభుత్వం రైతుల ఆందోళనల విషయంలో స్పందిస్తున్న తీరు భారతదేశ ప్రజాతంత్ర, రాజకీయ విలువలకు అనుగుణంగా ఉందని (!) ప్రకటించింది. చాలా ఇతర సందర్భాలలో మాదిరిగానే ఈ రైతుల ఆందోళన విషయంలోనూ మోడీ ప్రభుత్వం పార్లమెంటు లోపల, వెలుపల కూడా మోసపూరితంగానే వ్యవహరించింది. ఈ చట్టాలను ఈ విధంగా అడ్డగోలుగా ఆమోదింపజేసుకుని వుండకపోతే ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళనలు బహుశా తలెత్తివుండేవి కావేమో. ఇక శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న ఆందోళనాకారులను ఖలిస్తానీయులని ముద్ర వేయడం, దేశ రాజధాని చుట్టూ రోడ్లపై మేకులు దిగ్గొట్టి, ఇనుప కంచెలు అడ్డం పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించడం, ఒక జిల్లా తర్వాత మరొక జిల్లాకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేయడం, పాత్రికేయుల మీద వరసపెట్టి ఎఫ్‌ఐఆర్ లను బనాయించడం, ప్రభుత్వ అత్యాచారాలను విమర్శిస్తున్న వారి ట్విట్టర్ ఖాతాలను నిలుపుచేయాలని ట్విట్టర్ నిర్వాహకులపై ఒత్తిడి పెంచడం- ఇవన్నీ మోడీ ప్రభుత్వం ఎంత సొంపుగా, ఎంత గొప్పగా ''భారతీయ ప్రజాస్వామ్య విలువలను'' నిలబెడుతోందో చెప్పకనే చెప్తున్నాయి.
నిన్నటి దాకా నాకు ఆ రిహాన్నా ఎవరో తెలియదు. నాకే కాదు, బహుశా మన హోం మంత్రికి గాని, విదేశాంగ మంత్రికి గాని ఆమె గురించి తెలిసివుండదు. ఒకసారి తెలిశాక, ఆమె ట్విట్టర్ అనుయాయులు 10 కోట్ల మందికీ చెల్లు పెట్టడానికే అన్నట్టు భారతదేశంలో పెద్ద సంఖ్యలో ట్విట్టర్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలనందరినీ రంగంలోకి దించారు. దాంతో సినీ తారలూ, ప్రముఖ క్రీడాకారులూ పోటీలు పడి ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ట్వీట్లు మొదలుపెట్టారు. ఆ ఊపులో అవే పదాలను, అవే హ్యాష్‌టాగ్‌లను అందరూ వాడేశారు కూడా.
ఇక విదేశీయురాలు పెట్టిన ఆరే ఆరు పదాలున్న ట్వీట్‌కు ప్రభుత్వం స్పందించిన తీరు ఏమాత్రం నిజాయితీ లేకుండా, కపటంతో నిండి, వాస్తవాలతో సంబంధం లేకుండా ఉంది. విదేశాంగ మంత్రి చేసిన ట్వీట్ చూడండి. ''భారతదేశానికి వ్యతిరేకంగా దురుద్దేశపూర్వకంగా జరిగే ప్రచారాలు జయప్రదం కాలేవు. మన దేశాన్ని కాపాడుకునే ఆత్మవిశ్వాసం మనకుంది. దీనిని ఇండియా తిప్పికొడుతుంది.'' అని ఆయన చేసిన ట్వీట్ ఆయన ఊరికే గొప్పలు పోతూ చెప్పిదానిలో ఏమీ పస లేదని స్పష్టం చేస్తోంది. మన సమిష్టి జాతీయ స్ఫూర్తి ఎంత బలహీనంగా ఉందో, ఎంత అభద్రతతో ప్రభుత్వం ఉన్నదో విదేశాంగ మంత్రి, ఆయన సహచరులు పెట్టిన ట్వీట్లు వెల్లడిస్తున్నాయి. మన పిరికిపంద సెలబ్రిటీల మాదిరిగా కాకుండా ఆ బార్బడోస్ గాయని స్వేచ్ఛగా, స్వతంత్రమైన వ్యక్తిగా తన భావాలను ఉన్నవాటిని ఉన్నట్టు వెల్లడించింది. దానికి ప్రభుత్వం, పాలక పార్టీ ప్రతిస్పందించిన తీరే దురుద్దేశపూర్వకంగా ఉంది. ఆ ప్రతిస్పందనలో ఆత్మవిశ్వాసం ఎక్కడా కనపడలేదు సరికదా, చిత్తభ్రమ కూడా వ్యక్తం అవుతోంది. తనపై తనకు పూర్తి విశ్వాసం ఉన్న ప్రభుత్వమే అయివుంటే, ఆ గాయని ట్వీట్‌ను పట్టించుకోకుండా వదిలేసి వుండేది.
నేను క్రికెట్ క్రీడాభిమానిని. ఘనతకెక్కిన మన క్రికెట్ ఆటగాళ్ళు ఇలా వ్యక్తిగతంగా, సమిష్టిగా కూడా దిగజారిపోవడం చూస్తే విచారంగా ఉంది. ఆ గుంపులో ఒకే ఒక్కడు, తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునేలా స్పందించాడు. అతగాడే బిషన్‌సింగ్ బేడీ. అందరూ కూడబలుక్కున్నట్టు సాగించిన ఈ ప్రచారానికి అతనిదైన శైలిలో, తనను తాను తక్కువ చేసుకుంటూ గట్టిగా ప్రతిస్పందించాడు. ''ఆ బార్బడోస్ వ్యక్తి, ఆ వెంటనే మన భారతీయ టీవీ లు నన్ను గాఢ నిద్ర లోంచి తట్టి లేపే దాకా నిజంగా ఢిల్లీ వద్ద ఏం జరుగుతోందో నాకు తెలియనే తెలియదు. ఏరు! ముసిలీ! ఏదో ఒకటి మాట్లాడు! లేకపోతే నిన్నూ దేశద్రోహి కింద జమ కట్టేస్తారు!'' అని ట్వీట్ చేశాడు.
నేను గాంధీజీ శిష్యుడిని. ప్రస్తుతం అతిగా వేడెక్కిన దురహంకారమే దేశభక్తిగా చలామణీ అవుతున్న కాలంలో భారతీయులందరిలోకీ అత్యంత దేశభక్తుడు (గాంధీజీ నేడు జీవించివుంటే) ఈ పనికిమాలిన గొప్పల గురించి, బడాయి పోవడం గురించి ఏ విధంగా స్పందించి వుండేవాడా అని ఆలోచించాను. ఇతరులపై దేశద్రోహులన్న ముద్రలు వేయడం ద్వారా తాము సిసలైన దేశ భక్తులనిపించుకోడానికి ప్రయత్నిస్తున్న మోడీయుల భారతదేశం గురించి ఆయన ఏమని వ్యాఖ్యానించి వుండేవాడు? 1938లో గాంధీజీ చేసిన ఒక వ్యాఖ్య నాకు గుర్తుకొచ్చింది. ''దూరాలు చెరిగిపోతున్న ప్రస్తుత యుగంలో ఏ దేశమూ నూతిలో కప్పలాగా ఉండిపోకూడదు. కొన్నిసార్లు మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ద్వారా మనను మనం తాజాగా ఉంచుకోగలుగుతాం.''
(స్వేచ్ఛానుసరణ)
రామచంద్ర గుహ











