
రాజశేఖర్ చెరుకూరి
హఠాత్తుగా అన్ని టీవీల్లో ఒకటే ఫ్లాష్ న్యూస్.
'కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో అత్యంత వేగంగా. మరింత తీవ్రంగా వ్యాపిస్తుంది. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా బారిన పడటమే కాక, కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు సాధ్యమైనంత వరకూ ఇంటికే పరిమితం కావాలి. రేపటి నుండి ప్రభుత్వం కర్ఫ్యూ విధించబోతుంది'. గత వారం రోజులుగా దీని గురించి పేపర్‌లో చదివినా, ఎప్పటిలాగే మీడియా హడావిడి అనుకున్నాడు. కానీ చూడబోతే ఇదేదో పెద్ద ఆపద కొనితెచ్చేలా వుంది అని భయం వేసింది ప్రకాశరావుకి. ఫస్ట్ వేవ్ దీనిముందు ఎందుకూ సరిపోయేలా లేదు. అంతా అయిపోయింది ఇంక మాస్కులు తీసేసి, మునుపటిలా తిరగటమే తరువాయి అన్నట్లు ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఇలా తిరగబెట్టటం ఏమాత్రం మింగుడు పడటం లేదు. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు భార్యని కేకేశాడు. 'సరళా, నీ కొడుకు ఎక్కడున్నాడే?'
'వీధి చివర ఫ్రెండ్స్‌ని కలిసొస్తానని వెళ్ళాడండీ. వచ్చేస్తూ ఉంటాడు. అన్నంవేళ కూడా అయ్యిందిగా' భార్య సమాధానం.
వెంటనే ఫోన్‌చేసి 'ఇంత రాత్రిపూట బయట ఏమి చేస్తున్నావ్? తక్షణం ఇంటికి రా' అని కొడుకుని గట్టిగా మందలించి, ఫోన్ పెట్టేశాడు ప్రకాశరావు.
'ఏమయ్యింది నాన్నకి? ఎప్పుడూలేంది ఇంత కోపంగా వున్నాడు' అనుకుంటూ ఇల్లు చేరాడు శ్యాం.
'ఈ రోజు నుండి నేను చెప్పేదాకా కాలు బయట పెట్టావంటే ఊరుకోను. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ అడ్డమైన తిరుగుళ్ళూ తిరుగుతావు. లేకపోతే ఎప్పుడూ ఆ లాప్‌టాప్ ముందేసుకుని కూర్చుంటావు. ఇంక ఎక్కడికీ తిరగకుండా బుద్ధిగా ఇంట్లో ఉండు.' కొడుకు ఇంట్లో అడుగుపెట్టగానే దండకం మొదలెట్టాడు. తండ్రిలో అంత అసహనం ఎప్పుడూ చూడలేదు శ్యాం.
'ఏమయ్యింది ఈయనకి?' అనుకుంది భార్య సరళ కూడా. 'ఎందుకు వాడిని తిడుతున్నారు. ఇంకా చిన్న పిల్లాడు అనుకున్నారా ఏంటి? ఇంజినీరింగ్ ఫైనలియర్‌కి వచ్చాడు. కాసేపు స్నేహితులతో తిరిగితే తప్పా? అయినా వాడు ఎప్పుడూ చదువు అశ్రద్ధ చేసి తిరగలేదుగా' కొడుకుని వెనకేసుకొచ్చింది సరళ.
'ఇందాక టీవీలో చెప్పింది విన్నావా? అసలు మీకు ఏమన్నా భయం అనేది వుందా? మళ్ళీ ఆఫీసులు, కాలేజీలు అన్నీ మూసేయబోతున్నారు' అంటూ తన కోపాన్ని సమర్ధించుకున్నాడు ప్రకాశరావు. ఎప్పుడూ శాంతంగా వుండే భర్తని వింతగా చూస్తూ ఆవేశంలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడటం ఎందుకులే అని లోపలకి వెళ్ళిపోయింది సరళ.
తల్లిదండ్రులకి శ్యాం ఒక్కడే సంతానం. కాబట్టి ఇంట్లో తన ఈడు వాళ్ళు ఎవరూ లేక కుదిరినప్పుడల్లా స్నేహితులతో గడపడానికి ఇష్టపడతాడు. చక్కగా చదవటంతో పాటు నలుగురికీ సహాయపడాలని ఎప్పుడూ తపనపడుతూ ఉంటాడు. అందుకే చిన్న వయసులోనే ఒక స్వచ్ఛంద సంస్థలో సభ్యుడిగా చేరి, అనాథ పిల్లలకు వారాంతాల్లో చదువు చెప్తున్నాడు. వృద్ధుల ఆశ్రమానికి నిధులు సమకూర్చడంలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గనేవాడు. కరోనా మొదటి వేవ్‌లో ఫీజులు కట్టలేక స్కూలుకి దూరమైన ఎంతోమంది పిల్లలకు ఆన్‌లైన్‌లో తన స్నేహితులతో కలిసి పాఠాలు చెప్పాడు. దానికోసం కొంత మంది పిల్లలకు అవసరమైన టాబ్‌లనూ దాతల సహాయంతో సమకూర్చాడు. శ్యాం తండ్రి ఎప్పుడూ ఈ విషయాల్లో మంచి ప్రోత్సాహం అందిస్తూనే ఉండేవాడు.
తండ్రి మాటని ఎప్పుడూ జవదాటని శ్యాం, కోపంతో తండ్రి అన్న మాటలకు ఏమి సమాధానం చెప్పాలో పాలుపోక భోజనం చేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. 'ఎందుకు నాన్న ఈరోజు ఇంత కోపంగా వున్నాడు?' అని ఆలోచిస్తుంటే.. దానికి తన మనసులో ఒకటే కారణం కనిపించింది. బహుశా అదే అయ్యుంటుందిలే అనుకుని, మనసుని సమాధానపరుచుకున్నాడు.
ఇక క్లాసులు కూడా ఆన్‌లైన్‌లోనే ఉండటం వల్ల శ్యాం తండ్రి మాట జవదాటక తన రూంకే పరిమితమయ్యాడు. ప్రకాశరావు కొడుకుని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కువగా స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడటం, లాప్‌టాప్ ముందేసుకుని ఏదో పని చేసుకుంటున్నాడు. రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్న కొడుకుని చూసి జాలేసింది. అయినా ఏదో ఒకటిలే బయటకి వెళ్ళకుండా నా మాట విని, ఇంట్లో ఉంటున్నాడని స్థిమితపడ్డాడు.
రోజూ న్యూస్ చదువుతున్న శ్యాంకి పెరిగిపోతున్న కరోనా కేసులు చూసి, బాధ కలుగుతోంది. దానికితోడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికీ సహాయం చేయకుండా ఇంట్లో కూర్చోవడం తనని ఇంకా బాధిస్తోంది. సరైన సమయంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఇంజెక్షన్లు అందక ప్రాణాలు విడుస్తున్న వారి గురించి వింటూ, చదువుతూ, ఏమీ చేయలేని తన నిస్సహాయస్థితిని తల్చుకుని ఎంతో బాధపడ్డాడు. భోజనం కూడా సహించడం లేదు. అయినా తండ్రి మాట కాదన లేక ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.
పొద్దుటే కాఫీ తాగుతూ టీవీలో వార్తలు చూస్తున్నాడు ప్రకాశరావు. అంతకంతకూ ప్రబలుతున్న కరోనా గురించి, హాస్పటళ్ళలో కిటకిటలాడుతున్న పేషెంట్ల గురించి విని మనసు కకావికలం అవుతుంది. బంధువుల్లో ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఎటువంటి చెడువార్త వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. విన్నా వారికి ఏమాత్రం సహాయం చెయ్యలేని పరిస్థితికి చెప్పలేనంత బాధగా ఉంది. వృత్తిరీత్యా ప్రైవేటు అకౌంటెంటు అయిన ప్రకాశరావు ఇంటి దగ్గరి నుండే పనిచేస్తూ బయటకు వెళ్ళడం పూర్తిగా మానేశాడు. రెండు నెలలకు సరిపడా సరుకులు ముందే తెప్పించుకున్నాడు. పెరట్లో పండే కూరగాయలు ఉపయోగించుకుంటూ బయటకి వెళ్ళడం దాదాపుగా మానేశాడు. వార్తలు వింటూ 'ఈ మహమ్మారి ఎప్పటికి మాయమవుతుందో' అని నిట్టూరుస్తూ ఉండగా, ఎవరో తలుపులు గట్టిగా బాదారు. ఎవరా అంత గట్టిగా కొడుతున్నారు అని మాస్కు పెట్టుకుని, తలుపు తీశాడు ప్రకాశరావు. అవతల ముగ్గురు వ్యక్తులు మాస్కు లేకుండా ఉండేసరికి వెంటనే దూరంగా వెనక్కి జరిగి 'మాస్కు వేసుకోకుండా తిరగకూడదు అనే జ్ఞానం లేదా? అయినా ఎందుకు అంత గట్టిగా తలుపు కొడుతున్నారు? ఎవరు మీరు?' కోపంగా అడిగాడు.
'శ్యాం ఉండేది ఈ ఇంట్లోయేనా?' గద్దించి అడిగాడు వారిలోకీ బలిష్టంగా ఉన్న వ్యక్తి. చూడబోతే పెద్ద రౌడీలా ఉన్నాడు. వీడికి నా కొడుకుతో పని ఏంటా అనుకుంటూ 'అవును మా అబ్బాయే, ఇంతకీ మీరు ఎవరు?' అని గట్టిగా అడిగాడు. 'మేము ఎవరో మీ అబ్బాయిని పిలవండి తెలుస్తుంది' అన్నాడు వాడు అంతకంటే గట్టిగా. అంతలో శ్యాం రూంలో నుండి బయటకి వచ్చాడు బిక్కు బిక్కుమంటూ. 'ఇప్పుడే మీ డబ్బులు మీకు పంపించాను. మూడు నెలల వడ్డీ ట్రాన్స్‌ఫÛర్ చేశాను. మీ అకౌంట్ ఒకసారి చూసుకోండి' అని ఆ రౌడీ వెధవతో చెప్పాడు. ప్రకాశరావుకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. 'ఇంతకీ ఎవర్రా వాళ్ళు' అని అడుగుతుండగానే అవతల వ్యక్తులు ఎవరికో ఫోన్ చేసి 'డబ్బులు పడ్డాయంట. ఈసారి లేట్ అయితే ఊరుకునేది లేదని గట్టిగా చెప్పమన్నారు' అని వార్నింగ్ ఇచ్చి, ప్రకాశరావుని ఒక చూపు చూసుకుంటూ వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిన రెండు నిముషాలకు కానీ ఈ ప్రపంచంలోకి రాని ప్రకాశరావు 'ఎవర్రా వాళ్ళంతా? ఈ రౌడీమూకతో నీకు పనేంటి? వాళ్ళ దగ్గర నువ్వు డబ్బు తీసుకోవటం ఏంటి?' గద్దించి అడిగాడు కొడుకుని.
మెల్లగా ధైర్యంచేసి చెప్పసాగాడు శ్యాం. 'అవసరం వచ్చి ఆన్‌లైన్‌లో డబ్బులు వడ్డీకి తీసుకున్నా నాన్నా. టైంకి డబ్బులు ఇవ్వటం కుదరలేదు. అందుకే ఇలా..' నసిగాడు శ్యాం. 'అసలు ఈ వయసులో నీకు డబ్బుల అవసరం ఏంటిరా? అసలు నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చెయ్యటానికి నీకు ఎంత ధైర్యం?' అసహనంగా అన్నాడు ప్రకాశరావు.
'ఏమయిందో చెప్పు నాన్నా?' కారణం లేకుండా తన బిడ్డ అలా చేయడని సరళ నమ్మకంతో అడిగింది.
'మా కాలేజి ప్రాజెక్టు కోసం మా ఫ్రెండ్స్ అందరం కలిసి రెండు కంప్యూటర్ సర్వర్లు కొనాల్సి వచ్చింది నాన్నా. మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు లేకపోతే రెండు లక్షలు అప్పు చేసి, కొన్నాను. వాళ్ళకి సరైన సమయంలో డబ్బులు సర్దుబాటు కాలేదు. నెల రోజుల్లో డబ్బులు కట్టేస్తామన్నారు. నాకు నమ్మకం వుంది'. మెల్లగా చెప్పాడు శ్యాం. అది విన్న సరళకీ, ప్రకాశరావుకీ ఏమనాలో పాలుపోలేదు.
'చూడు నాన్న. నువ్వు బాగా సంపాదించి, అందులో కొంచెం సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ ఇలా అప్పుచేసి, శక్తికి మించి సహాయం చేయడం తెలివి తక్కువతనం అవుతుంది. ఎప్పుడూ అలా చేయకు' అని మందలించింది సరళ.
'నువ్వు అలా ప్రతి దానికీ మెత్తగా చెబుతూ ఉండు. ఎప్పుడో పెద్ద సంకటం తెచ్చి పెడతాడు నీ కొడుకు' కోపం, నిష్ఠూరం కలగలిపి అన్నాడు ప్రకాశరావు.
'శ్యాం, ఇంకొక నెల రోజుల్లో మీ స్నేహితులు డబ్బు సర్దుబాటు చెయ్యకపోతే ముందు మాకు చెప్పు. ఏమి చెయ్యాలో చూద్దాం. అంతేకానీ ఇలాంటి రౌడీ మూకల్ని ఇంటిదాకా తీసుకురాకు. ఈ ఆన్‌లైన్ రుణాలు ఇచ్చిన వాళ్ళు చేసే దారుణాల గురించి రోజూ పేపర్లు రాస్తుంటే నీలాంటి చదువుకున్న వాళ్ళూ ఇలా చేస్తే ఎలా?' మరోసారి గట్టిగా మందలించాడు ప్రకాశరావు.
ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు కొట్టారు. ఈసారి ప్రకాశరావు కోపం భయంగా మారి, మెల్లగా తలుపు తీశాడు. బయట కొంత మంది మాస్కులు వేసుకుని, కెమేరాలు పట్టుకుని ఉన్నారు. మళ్ళీ ఏమి ఉపద్రవం ముంచుకొచ్చిందో అని ప్రకాశరావుకి మాట పెగల్లేదు. అంతలో సరళ అందుకుని 'ఎవరండి మీరు?' అని అడిగింది. వాళ్ళు ధరించిన మాస్కు లోపల నుండి స్వరం వినిపించింది.
'మీరు శ్యాం తల్లిదండ్రులా అండీ?' అని ఒక వ్యక్తి మైకు పట్టుకుని అడిగాడు. 'అవును' అని భయం భయంగా తలూపాడు ప్రకాశరావు.
'మేము న్యూస్ ఛానల్ నుండి వచ్చామండీ. మీకు ఇంకా న్యూస్ అందలేదా?' అని అడిగారు.
'ఏమి న్యూస్?' ఒకేసారి అడిగారు ప్రకాశరావు, సరళ.
'మీరు సుబంధు మొబైల్ యాప్ గురించి విన్నారా?' అన్నాడు రిపోర్టర్.
'అవును. బాగా విన్నాను!' అన్నాడు ప్రకాశరావు.
'ఇదుగో చూడండి!' అని ప్రకాశరావు దంపతులకి ఆ రోజు న్యూస్ పేపర్ అందించారు వాళ్ళు. అందులో ఒక ఐటం మార్క్‌చేసి ఉంది. ''సుబంధు యాప్‌కి పిఎం అవార్డ్'' అని హెడ్డింగ్ ఉన్న వార్త అది. చదవటం మొదలుపెట్టాడు ప్రకాశరావు.
''కరోనా విపత్తు సమయంలో జాతికి ఉపయోగకరమైన ఒక గొప్ప యాప్‌ని రూపొందించి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో స్వచ్ఛంధ సంస్థల్ని ఒక తాటిపైకి చేర్చి, వాలంటీర్ వ్యవస్థని సమర్థవంతంగా ఉపయోగించుకునేట్లు చేసి, కొన్నివేల మందికి సహాయపడిన సుబంధు యాప్‌కి ప్రధానమంత్రి అవార్డు ప్రకటించడమే కాక, ఈ యాప్‌కి గుర్తింపునిస్తూ దానిద్వారా జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందివ్వబోతుంది. ఈ యాప్‌ని రూపొందించిన శ్యామ్‌ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు'' అని రాసి వుంది. మధ్యలో శ్యాం ఫొటో కూడా వేశారు.
చదవటం ముగించిన ప్రకాశరావు దంపతులకి నోటమాట రాలేదు. 'శ్యాం ఇంత గొప్పపని చేయడానికి మీ ప్రోత్సాహమే కారణమా సార్?' అని రిపోర్టర్లు అడగటంతో.. ఏం చెప్పాలో పాలుపోలేదు ప్రకాశరావుకి. 'లేదండి. మేము వాడిని ఇల్లు కూడా దాటనివ్వలేదు. అది పూర్తిగా వాడి గొప్పతనమే' తలదించుకుంటూ చెప్పాడు.
అంతలో శ్యాం వెనక నుండి వచ్చి 'నేను ఈ యాప్ రూపొందించడానికి పూర్తిగా మా తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం. మా తాతగారు డెబ్బయ్యో దశకంలో మసూచి మహమ్మారి వ్యాపించినప్పుడు అందరికీ సహాయపడుతూ తానూ ఆ మహమ్మారి సోకి బలయ్యారు. అప్పుడు మా నాన్న చాలా చిన్న పిల్లవాడు. ఆ సంఘటన నాన్న మీద తీవ్ర ప్రభావం చూపింది. చాలా కష్టాలుపడి చదువుకుని పైకొచ్చాడు. అయినా మా తాత రక్తమే మా నాన్నలోనూ ఉంది కాబట్టి ఆయన బంధువులకి, స్నేహితులకి, మా కాలనీ వాళ్ళకీ సహాయపడటం చూసే నాకూ ఆ లక్షణాలు వచ్చాయి అనుకుంటాను. నేను నా పాకెట్‌మనీ అంతా స్వచ్ఛంద సంస్థలకి ఖర్చు చేస్తానని నాన్నకి తెలుసు. అయినా ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. నాకు అవసరమైన దాని కంటే ఎక్కువే డబ్బులు ఇస్తారు. కానీ ఈ కరోనా మహమ్మారి గురించి వినేసరికి నాన్నకి మా తాతగారిని కోల్పోయిన సంఘటన గుర్తొచ్చింది. అందువల్ల తన ఏకైక బిడ్డనైన నన్ను అంత గట్టిగా ఇంట్లో ఉండమనేసరికి ఎందుకు అలా అని ఉంటారో నేను ఊహించగలిగాను. కానీ నేను ఆయన కొడుకుని, మా తాతకి వారసుణ్ణి కదా! అందుకే ఇంట్లో ఉన్నా, నేను ఈ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎలా సహాయం చేయగలనా అని ఆలోచించాను. అలాగే నా ఫైనలియర్ ప్రాజెక్టూ ఈ కరోనా టైంలోనే పూర్తిచెయ్యాల్సి వచ్చింది. ఈ రెండు పనులూ సమన్వయం చేసుకుంటూ ముందడుగు ఎలా వెయ్యాలా అని ఆలోచించాను. మనసుంటే మార్గం ఉంటుంది కదా, అందుకే ఇలా ఒక యాప్ రూపొందించటం మొదలుపెట్టాను. దాదాపు నెల రోజులు పగలు, రాత్రి కష్టపడి నేను నా స్నేహితులు దీన్ని పూర్తిచేశాం. ఈ సమయంలో నేను ఏమి చేస్తున్నానో తెలియకపోయినా నా శ్రమ చూసి, అమ్మ రాత్రి కూడా మేలుకొని, నాకు ఆహారం అందించేది. ముందుగా నాకు తెలిసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఈ యాప్‌ను పరిచయం చేసి, వారు దీన్ని ఉపయోగించేలా చేశాను.
ఈ యాప్ బాగా ఉపయోగకరంగా ఉండటంతో మరింతమంది ఇందులో చేరి, సేవలు అందించడం మొదలుపెట్టారు. ఎవరైనా తమకి కరోనా వల్ల ఇబ్బంది కలిగితే ఇందులో రిజిస్టర్ చేసుకుని, అభ్యర్థించడమో లేకపోతే తమకి తెలిసినవారి ద్వారా యాప్ నుండి అభ్యర్థించడమో చేస్తే అక్కడికి దగ్గర్లో ఉన్న వాలంటీర్లు వారికి తగిన సహాయం చేసి, యాప్‌లో వివరాలు పొందుపరుస్తారు. యాప్ ద్వారా మనకి దగ్గర్లో ఎక్కడెక్కడ వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయో నమ్మకమైన సమాచారం తెలుస్తుంది. దీనిలో వివరాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా ఎంతోమంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అంతేకాక మందులు తెచ్చుకోలేని వృద్ధులు, చిన్నపిల్లల పాలకోసం ఇబ్బందిపడే తల్లిదండ్రులు, ఇలా ఎందరో ఈ యాప్ ద్వారా సేవలు పొందారు. స్వచ్ఛంద సంస్థ తరఫున విద్యార్థులు, యువకులు నిష్కల్మషంగా చేస్తున్న ఈ సేవ ఇటువంటి కష్ట కాలంలో ఎందరినో తీవ్ర ఇబ్బందుల నుండి కాపాడుతోంది. ఈ యాప్ ద్వారా పొందే సేవలు పూర్తిగా ఉచితం అయినా కొంత మంది తమ సంతోషం కొద్దీ చెల్లించే డబ్బులు సాంకేతిక నిర్వహణ కోసం ఉపయోగించడం జరుగుతుంది.
ఈ క్రమంలో నేను కొంత రుణం తీసుకోవాల్సి వచ్చి, నా తల్లిదండ్రులకి అబద్ధం చెప్పడం సైతం జరిగింది. కానీ ఇప్పుడు ఈ యాప్ మీద నమ్మకం కలిగిన ఎంతోమంది దీనికి స్వచ్ఛందంగా ధన సహాయం అందించడం మొదలు పెట్టారు. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ యాప్ రూపొందించింది నేనే అని తెలియకపోయినా దీని గురించి న్యూస్‌లో విన్న మా నాన్న తనూ కొంత మొత్తం విరాళంగా ఇవ్వడం.. మా నాన్న మంచి మనసుకి ఒక గొప్ప ఉదాహరణ. సరైన సమయం వచ్చినప్పుడే దీని గురించి చెప్పాలని నేను మా తల్లిదండ్రులకు ఇంతవరకూ చెప్పలేదు. ప్రతిరోజూ చేసే కార్యక్రమాలతో పాటు, విరాళాల రూపంలో వచ్చే ప్రతి రూపాయి చాలా పారదర్శకంగా ఉండటంతో ఇది ప్రభుత్వ దృష్టికీ వెళ్ళి, గౌరవం పొందటం మా అదృష్టం. ఈ గొప్పతనం అంతా ఈ యాప్ ద్వారా సేవలు అందిస్తున్న ఎంతోమంది వాలంటీర్లదే. వారందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. ఈ అవార్డు ద్వారా ఇది మరింత మందికి చేరే అవకాశం ఉండటమే కాక, మరిన్ని సేవలు దీని ద్వారా చేసే సౌలభ్యం కూడా మెరుగవుతుందని ఆశిస్తున్నాను.
'సార్ మీరు మాట్లాడుతున్నదంతా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది' అని కెమేరామెన్ చెప్పేసరికి ప్రకాశరావు, శ్యాం ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని, సిగ్గుపడి చిన్నగా నవ్వుకున్నారు. తన కొడుక్కి అభినందనలు తెలుపుతున్న రిపోర్టర్లని చూస్తూ ప్రకాశరావు దంపతులు గర్వంగా ఫీలయ్యారు.