Mar 26,2023 23:47

ఎంపికి వినతిపత్రాన్ని అందజేస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు, ప్రమాదాల బారినపడిన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ ఆదివారం అనకాపల్లిలో ఎంపీ సత్యవతికి వినతిపత్రం అందజేసినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు స్థానిక విలేకరులకు తెలిపారు.తుని తాండవ బ్రిడ్జి వద్ద నుండి యలమంచిలి వరకు జాతీయ రహదారిపై నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రాంతాన్ని యాక్సిడెంట్‌ జోన్‌ గా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందన్నారు. జరుగుతున్న ప్రమాదాల కారణంగా గాయపడిన క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వస్తారని, వైద్యులు ప్రాధమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం అందించడానికి సౌకర్యాలు లేని కారణంగా గాయాల పాలైన క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రి, విశాఖపట్నం కేజీహెచ్‌ కు రిఫర్‌ చేస్తున్నారని తెలిపారు. సకాలంలో వైద్య అందక గాయపడిన క్షతగాత్రులు మార్గ మధ్యలోనే మరణించడం జరుగుతుందన్నారు. దీంతో అనేక కుటుంబాలు తీవ్రమైన క్షోభకు గురవుతున్నట్లు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లా మన్నారు.బాదితుల పరిస్థితులను అర్ధం చేసుకొని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించి, ట్రామా సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎ.రాజు ఉన్నారు .