ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్
ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
టాక్స్ ప్రాక్టీషనర్లకు నిరంతర పునఃశ్చరణ ఎంతో అవసరమని ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు. మారుతున్న పన్నుల విధానం పట్ల అవగాహన పెంచుకొనేందుకు శిక్షణ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్, ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పరోక్ష పన్నుల అంశంపై ఒకరోజు సదస్సు ఎంబివికె భవన్ లో నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గిరిజా శంకర్ అసోసియేషన్ సావనీర్‌ను ఆయన విడుదల చేసారు. అనంతరం ఇరు అసోసియేషన్ల ప్రతినిధులు చీఫ్ కమిషనర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టాక్స్ ప్రాక్టీషనర్లకు పన్నుల విధానం పట్ల ఎప్పటికప్పుడు పరిజ్ఞానం అవసరమని అన్నారు. నిజమైన పన్ను చెల్లింపు దారులకు ఇబ్బంది కల్గించకూడా చూడటంతో పాటు అదే సమయంలో పన్ను ఎగవేత దారుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్, ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.షరీఫ్ ఖాన్, మాట్లాడుతూ టాక్స్ ప్రాక్టీషనర్లకు ఉన్న ఇబ్బందులపై చర్చించి తమకు వత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ తరహా సదస్సులు ఉపకరిస్తాయని అన్నారు. సమస్యల వల్ల టాక్స్ ప్రాక్టీషనర్లు మానసిక ఒత్తిడికి గురై అకాల మత్యువాత పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లింపు దారుల సమస్యల పట్ల కమిషనర్ గిరిజ శంకర్ సానుకూలంగా స్పందించారని వివరించారు.










