
అప్పుడు అయోధ్య నుంచి ఇప్పుడు జ్ఞానవాపి మసీదు సమస్య వరకూ సుప్రీం కోర్టు ఈ విలువల పరిరక్షణ కోసం గట్టిగా ముందుకు రాకుండా సాగదీయడం, సర్దుబాటు మాత్రమే జరుగుతున్నది. కాంగ్రెస్ అనేక ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులు, పోటా పోటీ పూజలు ఇందుకు సరిపోవు. ఈ పూర్వరంగంలో కేవలం ఈ దేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం రాగాలాపన మాత్రమే సరిపోదని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తాజాగా వ్యాసం రాశారు. చాప కింద నీరులా సమాజంలో ప్రతి రంగానికి పాకిన ఈ రాజకీయ మత విభజనను తీవ్రంగా ఎదుర్కొనకపోతే ఈ దేశం మనుగడకూ లౌకిక ప్రజాస్వామిక జీవనానికి ముప్పు తప్పదు.
రాణి విడిచిపోయె రాజునొంటరిచేసి / రాజు విడిచిపోయె రాజ్యరమను / రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర / తాజి విడువలేదు రాజసమ్ము !
తాజ్‌మహల్ పై కవికోకిల గుర్రం జాషువా రాసిన ఈ పద్యం భారతీయుల మదిలో తాజ్ ఎంత ప్రగాఢ ముద్ర వేసిందీ చెబుతుంది. దేశ ప్రతిష్టకు చరిత్రకు కళాత్మక సంకేతంగా నిలిచిన తాజ్‌ను సందర్శించకపోతే విదేశీ నేతలు తమ పర్యటన సంపూర్ణం కాదని భావిస్తారు. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నించి కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మహాకవి శ్రీశ్రీ అన్నదాంట్లో కూడా అది ఈ దేశ ప్రజల సంపద అనే భావం. వందల ఏళ్ల చరిత్రలో అనేక మార్పులు మలుపులూ వుంటాయి గాని మానవాళి సృజించిన మహత్తర సాంస్కృతిక వారసత్వం అలా కొనసాగుతుంటుంది. దానికి కుల మతాలు, వంశాలు, వారసత్వాలు వంటి వివాదాలేమీ వుండవు. కాని ఇప్పుడు అలాంటి తాజ్‌మహల్‌పై తగాదాలు పెంచాలని దేశాన్ని పాలించే బిజెపి నేతలు, వారి వెనక వున్న సైద్ధాంతిక గురువు సంఘపరివార్ కంకణం కట్టుకున్నాయి. ఇందుకు ఏకంగా న్యాయస్థానాలనే ఆశ్రయించాయి. అయోధ్యలో బిజెపి మీడియా యువజన విభాగం బాధ్యుడుగా వున్న రజనీశ్‌్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో దీనిపై పిటిషన్ వేశారు. తాజ్‌లో 22 గదులకు తాళాలు వేసి వుంటాయని వాటిని తెరిచి ఏముందో ప్రజలకు వెల్లడించాలని ఆ పిటిషన్‌లో కోరారు. మీ పిటిషన్‌కు అసలు ఆధారమేమిటి? ఆ గదుల తాళాలు ఎందుకు వేశారో తెలియకుండా తీయమని ఎందుకు ఆదేశించాలి? అని హైకోర్టు న్యాయమూర్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్రంగా ప్రశ్నించారు. ప్రసిద్ధ పర్యాటక స్థలమైన తాజ్ చరిత్రతో చాలా రహస్యాలు ముడివడి వున్నాయని వాటిని తెలుసుకునే హక్కు తనకున్నదని ఆయన వాదించారు. దీనిపై న్యాయమూర్తులు మరింత మండిపడ్డారు. రేపు మీరొచ్చి దేశాధినేతల గదుల తాళాలు తెరిపించాలంటారు. మా న్యాయమూర్తుల కార్యాలయాల తాళాలే తీయించాలంటారు. ఒప్పుకుని ఉత్తర్వులు ఇవ్వాలా? అని ఎదురు ప్రశ్న వేశారు. చరిత్రపై మీకంత ఆసక్తి వుంటే పిహెచ్‌డి చేసి తెలుసుకోండి. కోర్టు సమయం వృథా చేయకండి అని వెనక్కు గొట్టారు.
ఈ కథ ఇక్కడితో అయిపోతే ఒక తీరు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసివేసిందో లేదో బిజెపి ఎం.పి దివ్య తాజ్‌మహల్ కట్టిన స్థలం మాదేనని ఒక వాదన లేవదీశారు. రాజస్థాన్ రాజవంశానికి చెందిన దివ్య తమ తాతముత్తాతల కాలం నాటి స్థలాన్ని మొఘలాయిలు తీసుకున్నారనడానికి పత్రాలున్నాయంటూనే ఆధారాలు తర్వాత చూపిస్తానని దాటేశారు. వందల ఏళ్లలో ఎవరి స్థలాలు ఎవరు తీసుకున్నారనేదాన్ని బట్టి ఇప్పుడు పంచాయితీ పెట్టుకుంటారా అంటేే వివాదాన్ని ఆరిపోకుండా చూసే ప్రయత్నమన్నమాట. గతంలోనూ పలుసార్లు బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ పరివార్‌కు చెందిన వారు తాజ్‌మహల్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాలు లేవదీయడం జరుగుతూనే వుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా వుందనేది వాస్తవం. దేశవ్యాపితంగా ఎక్కడికక్కడ ఏదో ఒక వివాదం రగిలించి విద్వేషం పెంచడం సర్వసాధారణం అయిపోయింది. నిజానికి అది మోడీ రెండవసారి ప్రధాని అయ్యాక మరింత తీవ్రరూపం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలకు ఇళ్లు ఇవ్వకపోవడమే గాక బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు.
జ్ఞానవాపి మసీదులో సర్వే
ఈ సమయంలోనే వారణాసి లోని జ్ఞానవాపి మసీదులో సర్వే జరపాల్సిందిగా స్థానిక న్యాయస్థానం ఒక కమిషనర్‌ను నియమించింది. విశ్వేశ్వరాలయం పక్కనే వున్న ఈ జ్ఞానవాపి మసీదుపై మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి వంటి సంస్థలు వివాదం పెడుతూనే వున్నాయి. అయోధ్య కాశీ, మధుర వారి వివాద త్రయం. యు.పి ఎన్నికలకు కొంచెం ముందే మోడీ విశ్వేశ్వరాలయ క్యారిడార్ విస్తరణ కోసం పనులు ప్రారంభించడం గుర్తుండే వుంటుంది. ఈ నిర్మాణంలో ఆలయాలు కూడా అనేకం తొలగించబడతాయనే ఆందోళనలున్నాయి. కాని తద్వారా హిందూత్వ ఎజెండాను అమలు చేయాలనే వ్యూహం మోడీ, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌లది. ఆ సమస్య అలా వుండగానే అయిదుగురు మహిళల పేరిట జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ అనుకుని తాము అమ్మవారి ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. చరిత్రలో వివాదాలుగా వున్నవాటిని పరిష్కరించడానికి ఎంత తతంగం అవసరమో, అయోధ్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకూడా ఎన్ని భిన్నాభిప్రాయాలకు దారితీసిందో చూశాం. కాని ఈ విషయంలో కోర్టు వెనువెంటనే స్పందించి ఏముందో సర్వే చేయించమని అసరు కుమార్ మిశ్రా అనే లాయర్‌తో కమిటీని వేసింది. ఈయన గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆయన స్థానంలో మరెవరినైనా పంపాలని మసీదు తరపున కమిటీ అభ్యంతరం చెప్పింది. దానికి ఒప్పుకోకపోగా మసీదు లోపల పరిశీలన వీడియో తీయడానికి అనుమతించారు. ఈ కేసు తక్షణం తీసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ అంగీకరించలేదు. మీరు హైకోర్టులో తేల్చుకోవాలన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలేమిటో తెలియకుండా నిలిపివేతకు ఎలా ఆదేశాలిస్తానని ఎదురుప్రశ్న వేశారు. ఎట్టకేలకు ఈ కేసును వినడానికి మాత్రం అంగీకరించి జస్టిస్ డి.వై చంద్రచూడ్‌కు అప్పగించారు. ఈలోగా కింద జరిగేది జరిగిపోతుంటుందన్నమాట. మధుర కృష్ణ మందిరం వివాదం కూడా నాలుగు మాసాల్లో తేల్చేయాలని ఆదేశాలొచ్చాయి.
ఆలయాలలో మతాతీత కళారాధన
కొద్దివారాల కిందట నుంచి కర్ణాటకలో సాగుతున్న మత రాజకీయ వివాదాలను తప్పక చెప్పుకోవాలి. కర్ణాటకలో హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదగ్రస్తం కావడం దేశమంతటా చర్చనీయమైంది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి భండారి ధర్మాసనం కూడా దేశ ప్రజల వేషభాషలపై విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. శ్రీరంగనాథ దేవాలయంలో నాట్యకళాకారుడైన జకీర్ హుస్సేన్ ప్రవేశంపై రంగనాథన్ నరసింహన్ అనే మతవాది వివాదం లేవదీయడంపై న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి హుస్సేన్ గతంలో ఆ ఆలయ వేడుకలలో నాట్యం చేసిన కళాకారుడే! కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సోమనాథ దేవాలయాన్ని సందర్శించినపుడు, ఎ.పి ముఖ్యమంత్రి జగన్ తిరుపతి వెళ్లినపుడు కూడా మతపరంగా సంతకాలు చేశారా లేదా అనేది ఒక వివాదంగా తేవడం ఇక్కడ గుర్తు చేయాలి. ఇదే సమయంలో కర్ణాటక మంత్రి జె.సి మధుస్వామి శాసనసభలో మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించరాదని వ్యాఖ్యానించారు. 2021లో తమ ప్రభుత్వం చేసిన హిందూ ధార్మిక సంస్థల చట్టం 12వ నిబంధనను ఇందుకు సాకుగా చూపారు. హిజాబ్ వివాదం వచ్చినపుడు ముస్లిం వ్యాపారుల సంఘం బంద్ పాటించింది గనక వారికి హిందూ ఆలయాల దగ్గర వ్యాపారాలు చేసుకునే అవకాశం వుండరాదని వాదించారు. కన్నడిగులు ఎక్కువగా వచ్చే శ్రీశైలంలోనూ ఇదే తరహా తగాదా పెట్టడం గుర్తుండే వుంటుంది. దేశ వ్యాపితంగా ఎన్నో దేవాలయాల్లో ముస్లిం వాద్యకారులు పాల్గొంటారు. పూలు, పూజాదికాలు సమకూరుస్తారు. ఇందుకు మతం అడ్డం కానే కాదు. భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా గంగాతీరంలో ఖాన్ షెహనాయి వాద్యం లేనిదే విశ్వేశ్వరుడు గాని ఇతర ఆలయాలు గాని మేలుకొనవని చెప్పుకునేవారు. గంగానదిపై రూపొందించిన డాక్యుమెంటరీ లోనూ ఆయన గంగా జమున తెహజీబ్ అంటూ మత సామరస్య సందేశమే ఇస్తారు. షేక్ చినమౌలానా నాదస్వరం దక్షిణ భారత దేశంలో చాలా ఆలయాల్లో వీనులవిందు చేసేది. ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. గంగానదీ సంగీత పుత్రుడైన బిస్మిల్లా ఖాన్ ఉదంతం నుంచి మనం ప్రస్తుతం నర్మదానది దగ్గరకు వద్దాం. నర్మదా తీరంలో హిందూ యేతరులు రాకను అక్కడి ఘాట్‌లలో వారు స్నానం చేయడాన్ని నిషేధించాలని మధ్యప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు అంటున్నారు. గతంలోనూ నర్మదా నది కాలుష్యంపై సాధుసంతులు ఆందోళన చేశారు. అప్పటి బిజెపి ప్రభుత్వంలో స్కాం జరిగిందని ఆరోపించారు. నర్మదా మహరాజ్, హరిహరానంద మహరాజ్, కంప్యూటర్ బాబా వంటి అయిదుగురు సాధువులకు 2018లో ప్రభుత్వం సహాయ మంత్రి హోదా ఇచ్చి పరిశీలన కమిటీగా నియమించింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తాయి గనక నర్మద తగాదా అవసరమైందన్నమాట. నదీనదాలు, ప్రకృతి స్థలాలు కూడా మతాలవారీ చూసే ఈ ధోరణి మీడియా సోషల్ మీడియాల ద్వారా 'కాశ్మీర్ ఫైల్స్' వంటి చిత్రాల ద్వారా దీన్ని బుర్రల్లోకి జొప్పిస్తుండడం వాస్తవం.
గుళ్ల నుంచి పెళ్లిళ్ల వరకూ...
ప్యార్ కియాతో డర్‌నా క్యా అని ప్రశ్నించిన ఈ దేశంలో లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మతాంతర వివాహాలను నిషేధించే చట్టాలను చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ మధ్య అస్రీన్ అనే అమ్మాయిని పెళ్లాడిన నాగరాజును ఆమె తరపువాళ్లు దారుణంగా చంపితే మిగిలిన 79 దురహంకార హత్యల నుంచి విడదీసి మత కోణమే ముందుకు తెచ్చారు. ఆఖరుకు బిజెపి గవర్నర్ కూడా నివేదిక అడుగుతున్నారు! మనుషుల వివాహాల మాట అటుంచి సాక్షాత్తూ తిరుపతి వెంకన్న ఢిల్లీ సుల్తాన్ కుమార్తె బీబీ నాంచారిని చేపట్టినట్టు నమ్మకాలున్నాయి. ఆమె ఆలయం దేవునికడపలో వుంది. తిరుమలలో వారి కుటుంబానికి ఒక పరంపరగా అవకాశమిస్తారు. కులీకుతుబ్‌షా భాగమతి ప్రేమ చిహ్నంగా భాగ్యనగరం కట్టించాడనే కథకు భిన్నంగా చార్మినార్ లోనే భాగ్యలక్ష్మి ఆలయం స్థాపించి ఆ విధంగా ఆ పేరొచ్చిందంటున్నారు. ఇది గతంలో నుంచి చేస్తున్నారు గాని ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు బండి సంజరు ప్రతి పని ఆ ఆలయం నుంచే మొదలెడుతున్నారు. ఎ.పి లో అయితే ఇస్లాం క్రైస్తవ కోణంలో విద్వేషాలు రగిలిస్తున్నారు. తిరణాలల నుంచి ఉరుసుల వరకూ మతాతీతంగా పాల్గొనే ఈ దేశంలో రామనవమి, హనుమాన్ జయంతి వంటి పండుగలను హింసాత్మకంగా మార్చేశారు. అది కూడా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఇటీవల ఈ పండుగల సందర్భంగానే డజన్ల మంది చనిపోయారు. ఇలాంటి ఉదాహరణలు ఉద్రిక్తతల గురించి ఎంతైనా చెప్పొచ్చు. అప్పుడు అయోధ్య నుంచి ఇప్పుడు జ్ఞానవాపి మసీదు సమస్య వరకూ సుప్రీం కోర్టు ఈ విలువల పరిరక్షణ కోసం గట్టిగా ముందుకు రాకుండా సాగదీయడం, సర్దుబాటు మాత్రమే జరుగుతున్నది. కాంగ్రెస్ అనేక ప్రాంతీయ పార్టీల సన్నాయి నొక్కులు, పోటా పోటీ పూజలు ఇందుకు సరిపోవు. ఒవైసీ సోదరులు ఇటీవల మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌లో ఔరంగజేబ్ సమాధి దగ్గర ప్రార్థన చేస్తే శివసేన, బిజెపి లతో సహా అందరూ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ నియమించిన ఒక కమిషన్ ఇటీవలనే గుజరాత్ పిలనిలో జరిగిన సమావేశంలో మతతత్వం పెరిగిపోతున్నదని విభజన ధోరణలు ఆందోళన కలిగిస్తున్నాయని విమర్శించింది. ఈ పూర్వరంగంలో కేవలం ఈ దేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం రాగాలాపన మాత్రమే సరిపోదని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తాజాగా వ్యాసం రాశారు. చాప కింద నీరులా సమాజంలో ప్రతి రంగానికి పాకిన ఈ రాజకీయ మత విభజనను తీవ్రంగా ఎదుర్కొనకపోతే ఈ దేశం మనుగడకూ లౌకిక ప్రజాస్వామిక జీవనానికి ముప్పు తప్పదు.
తెలకపల్లి రవి