ప్రజాశక్తి-అరకులోయరూరల్: విద్యు త్ లేని ప్రాంతాల్లో తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం సోలార్ నీటి పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకాలు మరమ్మతుకు గురై మూడు వారాలు కావస్తునప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో ట్యాంక్, కుళాయి, ట్యాపులు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ పరిస్థితి మండలంలోని పద్మాపురం పంచాయతీ దుమ్మగూడ గ్రామంలో నెలకొంది. గ్రామంలో . సోలార్ తాగునీటి పథకం మూడు వారాల క్రితం మరమ్మతుకు గురైంది. దీంతో కుళాయిలు పని చేయక పోవడంతో సోలార్ ట్యాంక్ అలంకప్రాయంగా ఉంది. గ్రామంలో తీవ్రంగా మంచినీటి కొరత ఏర్పడింది. గ్రామంలో సుమారు 55 కుటుంబాలు నివస్తున్నాయి. మంచి నీరు లేక గ్రామానికి దూరంగా ఉన్న పొలం పక్కన ఉన్న ఊట నీటిని తీసుకొచ్చి తాగుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా బురుదనీరు కావడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సోలార్ గ్రావిటీ తాగునీటి పథకం మరమ్మతు చేపట్టి వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.










