Nov 14,2023 21:47

తాగునీటి సమస్యను మున్సిపల్‌ డిఒకి వివరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : పట్టణంలో తాగునీరు సరఫరాలో జరుగుతున్న తీరుపై సిపిఎం పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, సంచాన ఉమా మహేశ్వరరావుతో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు నిమ్మకాయల సుధీర్‌, మజ్జి శశికర్‌ మున్సిపల్‌ డిఇ కిరణ్‌కుమార్‌ను నిలదీశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ డిఇకి వినతిని అందజేశారు. తాగునీటి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలకు నాలుగు రోజులకు, ఐదు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా జరుగుతుందని, సరఫరా కూడా అరకొరగా ఇస్తున్నారని, దుర్వాసనతో కూడుకున్న నీళ్లు కొన్ని వార్డుల్లో వస్తున్నాయని తెలిపారు. వీధుల్లో ఉన్న బోర్లు ద్వారా కూడా అంతంత మాత్రమే నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో 70 శాతం మంది ప్రజలు మున్సిపాల్టీ సరఫరా చేసే నీళ్లపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. దీపావళి రోజున కూడా మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపాల్టీ ఉందన్నారు. సుమారు రూ.63 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం పనులు ప్రారంభించి అర్ధాంతరంగా ఎందుకు పనులు నిలిపివేశారని ప్రశ్నించారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్నిసార్లు, ఎంతమందికి చెప్పినా సమస్య తీరడం లేదని, సమస్య పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టి పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాను అందించకపోతే పట్టణ ప్రజల్ని కదిలించి పెద్దఎత్తున ఆందోళన చేసి మున్సిపల్‌ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముట్నూరు వెంకటరమణ, శిరేల శ్రీను, పొన్నాడ శ్రీను, బూర్లి వెంకటేష్‌, కొత్తగుండు గణేష్‌, ముట్నూరు లక్ష్మీ నరసింహమూర్తి, మాడుగుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.