Jul 14,2023 19:24

పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆస్పరి
గ్రామాల్లో తాగునీరు సక్రమంగా అందించడంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు, మండల నాయకులు బాలకృష్ణ, రంగస్వామి, రామాంజినేయులు మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని జొహరాపురం, శంకరబండ, హలిగేర, కారుమంచి గ్రామాల్లో సందర్శించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జొహరాపురం గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి వక్కరేనులోని ఒండు నీరు తాగుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. హంద్రీనీవా ద్వారా జొహరాపురంలో రిజర్వాయర్‌ నిర్మించి, ఆస్పరి మండలంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎన్నికల ముందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ హామీఇచ్చారని తెలిపారు. నాలుగేళ్లు గడుస్తున్నా హామీ అమలుకు నోచుకోలేదన్నారు. మంత్రికి చిత్త శుద్ధి ఉంటే జొహరాపురంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలో శంకరబండ, హాలిగేర, కారుమంచి గ్రామాల్లో నాగనాథనహల్లి నుంచి 15 రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య, స్వచ్ఛభారత్‌ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో విధులకు హాజరు కావడం లేదన్నారు. డ్రెయినేజీ కాలువలు శుభ్రం చేయకపోవడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండిపోయి, దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. అధికారులు స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పంచాయతీ సెక్రటరీలకు వినతిపత్రం అందజేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు మాణిక్యప్ప, రంగప్ప, నాగయ్య, నాయుడు, రంగస్వామి, శివ, దస్తగిరి, నరేంద్ర, సురేంద్ర, అంజినయ్య, బాలచంద్ర పాల్గొన్నారు.