Nov 05,2023 23:58

ప్రజాశక్తి-కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఆదివారం కాజులూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిచేందుకు రూ.3.27 కోట్ల నిధులతో నూతనంగా నాలుగు వాటర్‌ టాంక్‌ల నిర్మాణానికి మంత్రి వేణుగోపాల కృష్ణ శంకుస్థాపన చేసారు. కుయ్యేరు గ్రామంలో రూ.కోటీ 63 లక్షల నిధులతో, ఐతపూడిలో రూ.43.40 లక్షల నిధులతోను, తిప్పరాజుపాలెంలో రూ.77.40 లక్షల నిధులతోను, చేదువాడలో రూ.40.20 లక్షల నిధులతో 40 కెఎల్‌ సామర్థ్యం కలిగిన 4 వాటర్‌ ట్యాంకుల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగేళ్ల కాలంగా ప్రజల సమస్యలను ఎప్పడికప్పుడు పరిశీలించి, పరిష్కరి స్తున్నారన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో భూగర్బ జలలాలు కలుషితమై ప్రజలు తాగునీటి ఇబ్బందితో పాటు, అరోగ్య సమస్యలకు లోనవుతున్నారని గుర్తించి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యల పరిష్కారనికి పరిశుభ్రమైన ఉపరితల నీటిని ఇంటింటికీ అందించే ప్రణాళికను ముఖ్యమంత్రి మంజూరు చేసారని తెలిపారు. తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరు అందించేందుకు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లతో పాటు పైప్‌ లైన్‌ నిర్మాణ పనులను చేపట్టినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపాలను తొలగించి, స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం పెంపొందించేందకు రామచంద్ర పురం నియోజకవర్గంలో స్వచ్ఛత మన భాద్యత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తాగునీరు, పారిశుధ్యంతో పాటు అన్ని గ్రామాల్లో రోడ్లు డ్రెయిన్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టి పల్లెలను పట్టణాల కంటే ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద మండలంలోని గ్రామాల్లో ప్రజలు తెలియజేసిన అన్ని సమస్యలన్నిటికీ సత్వర పరిష్కారం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో కాజులూరు ఎంపిపి మాతా భారతి మురళి, జెడ్‌పిటిసి సుబ్బారావు, ఎంపిడిఒ రతన్‌ రాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ ప్రసాద్‌, డిఇ శ్రీదేవి, గుబ్బల ఏసురాజు పాల్గొన్నారు.