Sep 01,2023 22:30

ముదిగుబ్బలో కార్మికుల వినూత్న నిరసన

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో మడకశిర, హిందూపురం డివిజన్లలోని శ్రీరామ్‌ రెడ్డి తాగునీటి సరఫరా కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్మికులతో కలసి వెంకటేష్‌ జిల్లా కలెక్టరేట్‌ లో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ రెండు డివిజన్లలో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలు ఉన్న ఐదు నెలల వేతనాలు, పిఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించాలని గత నెల 29 నుంచి సమ్మె చేస్తున్నారన్నారు. కార్మికులకు ఇస్తున్న వేతనంలో ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం కాకుండా 2500 రూపాయలు తగ్గించి కాంట్రాక్టర్‌ ఇస్తున్నారని విమర్శించారు. మరికొందరికి ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వేతనంలో కోత తో పాటు 18 నెలల పిఎఫ్‌ ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే సూపర్వైజర్‌ నాగరాజు దూషిస్తూ వేధింపులకు గురి చేస్తూ బెదిరిస్తున్నాడన్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని సబ్‌ కలెక్టర్‌ను కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు సుబ్బరాజు, నాయకులు గోపాల్‌, మురళి, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : వేతనాలు చెల్లించాలని కోరుతూ సత్య సాయి తాగునీటి పథకం కార్మికులు ఎనిమిదవ రోజు తమ నిరసన కొనసాగించారు. సత్యసాయి పంప్‌ హౌస్‌ ఎదుట ఒంటి కాలిపై నిలబడి నిరసన చేపట్టారు. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు చంద్ర, కృష్ణా నాయక్‌, ధర్మానాయక్‌, గోపాల్‌ నాయక్‌, రాజు, అల్లిపీరా, అల్లా బకాష్‌, ముత్యాలప్ప రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.