Jun 05,2023 21:09

వాటర్‌ సంపును పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఎంఐజి కాలనీలో ఉన్న తాగునీటి సంపునకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పట్టణ సీనియర్‌ నాయకులు ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, గోపాల్‌, తిప్పన్న డిమాండ్‌ చేశారు. సోమవారం ఎంఐజి కాలనీలో ట్యాంకు దగ్గర ఉన్న సంపును సిపిఎం నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంపు పైభాగం సగం పెచ్చులూడి రంధ్రాలు పడ్డాయని తెలిపారు. చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దుమ్ము, ధూళి, కోతులు, కుక్కలు, పందులు, పక్షులు సంపులో పడి నీరు కలుషితమయ్యే అవకాశముందన్నారు. ఈ నీటినే ట్యాంకుకు చేరుస్తూ వార్డులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని చెప్పారు. గతంలో నీటి కలుషితం వల్ల కొందరు మృత్యుపడిన ఘటనలు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సంపునకు మరుమ్మతులు చేపట్టి ప్రజల ఆరోగ్యంతోపాటు ప్రాణాలు కాపాడాలని కోరారు. నీటి సంపు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి కంచె ఏర్పాటు చేయాలని తెలిపారు.