ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని పెద్దబిడ్డ పంచాయతీ సుద్ధగరు గ్రామంలో తాగునీటి సమస్యతో గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోని బోరు బావి, తాగునీటి పైపులైన్ వంటి సౌకర్యాలు లేక గ్రామానికి సమీపంలో ఉన్న కలుషితమైన ఊటనీటిని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఉన్న ఊట గెడ్డ కూడా అట్టడుగుకు ఇంకి పోవడంతో తాగునీటి కోసం మహిళలు మైలుదూరన్న గెడ్డలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత ఆర్ డబ్యుఎస్ అధికారులకు అనేకసార్లు కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసామని ఎ.ఎర్రమ్మ, ఎ.అప్పాలమ్మ, సిందుకొడి, కమల, ఎ.లక్ష్మీలు వాపోయారు. పదేళ్ల క్రితం బోరు ఏర్పాటు చేసినప్పటికీ కనీసం చుక్క నీరు కూడా అందలేదని, దీంతో బోరు మూలకు చేరిందన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రస్తుతం తాము ఎక్కడైతే ఊట నీరు సేకరిస్తున్నామో అక్కడి నుండి పైపులు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరారు. లేని పక్షాన మండల కేంద్రంలో ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.










