ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
పట్టణంలో ప్రజలు తాగినీటి సమస్యతో అల్లాడుతున్నారు. సోమవారం తెల్లవారు జాము నుంచి తాగునీటి సరఫరా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని పలువురు స్థానికులు వాపోయారు. గత రెండు రోజులుగా రాత్రిపూటలో వోల్టేజి సమస్య రావడంతో బోరు బావులు పనిచేయడం లేదు. దీంతో తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకూ తీవ్రమైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కూలీ నాలీ చేసుకునే సామాన్య ప్రజలకు సకాలంలో తాగునీరు అందక ఉపాధిని కూడా కోల్పోతున్నామని వాపోతున్నారు. ప్రధానంగా 27వ వార్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వాటర్ ట్యాంక్ నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వందల సంఖ్యలో పట్టణ నలుమూలకు వాటర్ క్యాన్లతో తాగునీటిని తీసుకెళ్లడం జరుగుతుంది. విద్యుత్ అంతరాయం వలన మోటర్‌లు తిరగడం ఆగిపోతున్నాయి. పట్టణంలో తాగు నీటి సరఫరా పూర్తిగా బోరుబావుల ఆధారంగా జరుగుతుంది. ఇటీవల విద్యుత్ శాఖ ఉద్యోగులు వర్క్ టు రూల్ పాటించడం వల్ల రాత్రి సమయంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కరించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో పూర్తిస్థాయిలో బోరు బావులు ద్వారా తాగునీటి సరఫరాపై ఆధారపడిన జంగారెడ్డిగూడెం ప్రజలు రాత్రిపూటలో ఓల్టేజీ సమస్య, విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ కమీషనర్ భవానీ ప్రసాద్‌ను వివరణ అడుగగా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.










