
ప్రజాశక్తి-పెదనందిపాడు రూరల్ : పెదనందిపాడులో తాగునీటి సమస్యపై ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రాజకుమారి అన్నారు. మండల కేంద్రమైన పెదనందిపాడులో శుక్రవారంనిర్వహించిన 'జగనన్నకు చెబుదాం'లో స్థానిక మహిళలు సమస్యను వివరించారు. కొంతకాలంగా పెదనందిపాడులో కుళాయిలు ద్వారా వచ్చే నీరు రంగు మారి దుర్గంధ వాసనతో వస్తున్నాయని చెప్పారు. ఆ నీటివల్ల కొంతమంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన జెసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జెసి మాట్లాడుతూ జిల్లాలో స్పందన కార్యక్రమానికి గ్రామాల నుండి అర్జీలు అధిక సంఖ్యలో వస్తున్నాయని, వీటి పరిశీలన కోసం క్షేత్రస్థాయికే వస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా అభివృద్ధి పనులు విషయంలో జెసి ఎదుట అధికార, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు వాదోపవాదాలకు దిగారు. పనులకు ప్రతిపక్ష వారు ఆటంకం కలిగిస్తున్నారని అధికారపక్షం ఆరోపించగా.. పనులు సరిగా ఉంటే తామెందుకు అడ్డు పడతామని ప్రతిపక్షం నాయకులు అన్నారు. కార్యక్రమంలో మొత్తం 95 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి బి.మనోరంజని, ఎంపిడిఒ రాజగోపాల్, తహశీల్దార్ మహబూబ్ సుభాని, పత్తిపాడు యార్డ్ డైరెక్టర్ షేక్ ఖాసిం పీరా, సొసైటీ డైరెక్టర్ నాగయ్య పాల్గొన్నారు.