ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఫరిస్సా మొహల్లా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ సైదాన్‌బీ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఛైర్మన్ బోయ శాంత అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిలర్లు ఎవరూ సమస్యలపై ప్రశ్నించకపోగా కేవలం వైసిపికి చెందిన ఫరిసా మొహల్లా కౌన్సిలర్ సైదాన్‌బీ, టిడిపి కౌన్సిలర్ పార్వతిలు ప్రశ్నించారు. ఫరిసా మోహల్లాలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉందని, ప్రతిసారీ కౌన్సిల్‌లో విన్నవిస్తున్నామని, ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇందుకు మున్సిపల్ ఎఇ మాట్లాడుతూ... వచ్చే కౌన్సిల్ సమావేశం నాటికి సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. 1వ వార్డులో డ్రెయినేజీలు నిర్మించాలని కౌన్సిలర్ పార్వతి కోరారు. ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త అలాగే ఉందని తెలిపారు. సంపూర్ణ పరిశుభ్రత ఎక్కడా అని, చెత్త సేకరణకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని కౌన్సిలర్ బాలాజీ అధికారులకు వివరించారు. చెత్త ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇంటింటి వద్దకు ఆటోలు వెళ్తున్నా చెత్త ఎందుకు ఇవ్వడం లేదని, కౌన్సిలర్లు కూడా సహకరించాలని కమిషనర్ రఘునాథ్ రెడ్డి కోరారు. కేవలం రెండు ప్రశ్నలతో కౌన్సిల్ సమావేశం ముగిసింది. కౌన్సిలర్లు ఎవరూ సమస్యలు లేవనెత్తడం లేదు. కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి, సందీప్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ హరినాథ్ ఉన్నారు.
కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్ పార్వతి










