ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో కించాయి పంచాయతీ గుమ్మసిరగంపుట్టు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలని గ్రామ గిరిజన మహిళలు, గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం జూనియర్ అసిటెంట్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వైస్ ఎంపీపీ 1 పాటుబోయి సత్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ, గుమ్మసిరగంఫుట్ గ్రామంలో మూడు నెలలుగా మంచినీటి సమస్య నెలకొందని, పరిష్కరించే నాధుడే లేడన్నారు. పరిష్కారం చేయాలని పాడేరు ఐటీడీఏ స్పందనలో ఫిర్యాదు చేసినా నేటికి అధికారుల్లో కనీస చలనం లేదని మండిపడ్డారు. గ్రామంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, గడిచిన రెండు నెలల నుండి తాగడానికి గుక్కెడు మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించకుంటే ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయంను ముట్టడి చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలతో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










