Apr 22,2023 00:22

నినాదాలు చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- పాడేరు: ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి స్వగ్రామం గుడివాడ వీధిలో తాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం గుడివాడ మెట్ట వీధి మహిళలు ఖాళీ బిందెలతో ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. కలుషిత నీటిని బాటిల్లో తీసుకొచ్చి ప్రదర్శించారు. అనంతరం గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, గుడివాడకు తాగునీటి సదుపాయం కల్పించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తాగునీటి కోసం ట్యాంకు నిర్మించామని, గ్రావిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి జలజ్జీవన్‌ మిషన్‌ వంటి పథకాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం గుడివాడ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె నిలదీశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మెట్ట వీధి మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు
హుకుంపేట:తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని పాడేరు ఐటీడీఏ ఎదుట గిరిజనులు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలోని మత్స్యపురం పంచాయితీ ఊటగెడ్డ, కంబిడి పుట్టు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిస్కారం చేయాలని కోరుతూ ఆ రెండు గ్రామాల ప్రజలు సీపీఎం హుకుంపేట వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం ఐటీడీఏ గ్రీవెన్స్‌ లో పీఓ అభిషేక్‌కు కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన పీఓ జేజేఎం నిధులతో పాటు, ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఊట గెడ్డ,కంబిడి పుట్టు వార్డ్‌ మెంబర్‌ గోల్లోరి వెంకటేష్‌, మత్స్య పురం పంచాయితీ నాయకులు గోల్లోరి అప్పల స్వామి, టీడీపీ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి బోయిన శంకర్‌ నాయుడు, దేముడు, సిద్ధు, సప్పి అబ్రహం పాల్గొన్నారు.