
ప్రజాశక్తి-రాంబిల్లి
మండలంలోని జి.చింతవ పంచాయతీ పరిధి లోవపాలెం ఎన్టీఆర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడు నాయుడు ఆధ్వర్యలో ఆ కాలనీ మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేముడునాయుడు మాట్లాడుతూ సుమారు 70 కుటుంబాలు నివాసముంటున్న ఈ కాలనీ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కాలనీలో అంతంత మాత్రంగానే కుళాయిలు ఏర్పాటు చేశారని, వారంలో రెండు రోజులు మాత్రమే కుళాయిలు నీరు వస్తుందని తెలిపారు. గత వారం రోజులు కుళాయిలు ద్వారా నీరు రావడం లేదన్నారు. ఈ నీరు వాడుకకు తప్ప తాగడానికి ఉపయోగకరంగా లేవన్నారు. గత్యంతరం లేక ఈ కుళాయిల నీటినే తాగి అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న యాచరీ వద్దకు వెళ్ళి తాగునీటిని తెచ్చుకొని పొదువుగా వాడుకోవాల్సిన పరిస్థితి దావురించిందని వాపోయారు. పండుగలు, శుభకార్యాలు సమయాల్లో కాలనీవాసులు తాగునీటికి పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతమన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ కాలనీలో మంచినీటి పథకం ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని కోరారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టరు, ఎంపీడీవోకు వినతిపత్రాలను అందజేస్తామని తెలిపారు.