Sep 03,2023 17:05

ఇస్తానుసారంగా డ్రెయినేజీ నిర్మాణం - పైపులైన్లు ధ్వంసం
కాసుల ముసుగులో పట్టించుకోని సర్పంచి, కార్యదర్శి
తాగునీరు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న గ్రామస్తులు
ప్రజాశక్తి - మండవల్లి
      కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రెయినేజీ నిర్మాణం పనులు ఇస్తానుసారంగా నిర్వహిస్తూ పైపులైన్లు ధ్వంసం చేస్తున్నారు. దీంతో ప్రజలు రోజుల తరబడి తాగు, వాడుక నీరు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చర్యలు తీసుకోవాల్సిన సర్పంచి, కార్యదర్శి కాసుల ముసుగులో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ కాంట్రాక్టర్‌కు సహకరిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దీంతో మండవల్లి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
       గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రహదారి విస్తరణలో భాగంగా మండల కేంద్రమైన మండవల్లిలో జాతీయ రహదారి వెంబడి డ్రెయినేజీ నిర్మాణం పనులు చేపట్టారు. డ్రెయినేజీ నిర్మాణం పనులలో ఇబ్బందులు తలెత్తితే చూసి చూడనట్లు వ్యవహరించాలని ఎన్‌హెచ్‌ అధికారులతో మరో మధ్యవర్తి సాయంతో సర్పంచి, కార్యదర్శి కొంత పైకానికి కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టర్‌ తాగునీటి పైప్‌ లైన్‌లు ధ్వంసం చేస్తూ.. డ్రెయినేజీ నిర్మాణ పనులను చేపట్టాడు. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ని ప్రశ్నించడానికి ఏఒక్క అధికారి ముందుకు రాలేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. దీంతో గ్రామ ప్రజలకు తాగునీరు, వాడుక నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి పైపులైన్లు ధ్వంసమై, గ్రామస్తుల దాహార్తిని తీర్చాల్సిన వేలాది లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ప్రతిరోజూ రహదారి పాలైపోతుంది. అంతేకాకుండా డ్రెయినేజీ నిర్మాణ పనులను క్రమ పద్ధతిలో కాకుండా, ముక్కలు ముక్కలుగా నిర్మించి అర్థాంతరంగా వదిలేశారు. దీంతో మురుగు పారేందుకు అవకాశం లేకపోవడంతో మురుగునీరు రహదారి పైకి చేరి, దుర్వాసన వెదజల్లడంతో పాటు, రహదారి ధ్వంసమైంది. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు, గ్రామస్తులు గ్రామ సభల్లో, స్పందన కార్యక్రమాలలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ ఏ స్థాయిలో ముడుపులు చెల్లించారో తెలీదు కానీ ఎన్‌హెచ్‌ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ నేటి వరకూ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయలేదు.
        సుమారు 6 నెలల తర్వాత తిరిగి ఆగస్టు 1 న స్టేషన్‌ రోడ్డులో మళ్లీ డ్రెయినేజీ నిర్మాణ పనులను చేపట్టి మొదటి రోజే పైపులైను ధ్వంసం చేసేశారు. దీంతో గ్రామానికి తాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకూ సుమారు 8 సార్లు పైప్‌ లైన్‌ ధ్వంసం చేసేసి, డ్రెయినేజీ నిర్మాణ పనులను చేపట్టినా, గ్రామస్తులకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు..! అధికారులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారనేది, కాంట్రాక్టర్‌కు ఎలా సహకరిస్తున్నారు అనేది తేటతెల్లమవుతుందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులలో పైపులైన్లు ధ్వంసం అయితే వెంటనే మరమ్మతులు చేయించి నీరందించాల్సి ఉన్నప్పటికీ, కాసుల ముసుగులో అధికారులు ఎవరూ ఆ విధంగా చర్యలు చేపట్టకపోవడంతో రోజుల తరబడి ప్రజలు తాగు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి ప్రజలను తాగునీటి కోసం ఇబ్బందులు పడేలా చేయడం ఎంతవరకూ సమంజసమని మండవల్లి ప్రజలు అధికారులను, సర్పంచిని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, తాగునీటి కష్టాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని, గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై కార్యదర్శి తోట శ్రీనివాసరావును వివరణ కోరగా డ్రెయినేజీ నిర్మాణ పనుల వల్ల పైప్‌ లైన్లు ధ్వంసం అవుతున్న మాట వాస్తవమేనన్నారు. కాంట్రాక్టర్‌కు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. పైప్‌లైన్‌లు ధ్వంసమై గ్రామంలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తేయని ఆయన తెలిపారు. గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు నిర్వహించుకోవాలని, లేకుంటే డ్రెయినేజీ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని హెచ్చరించామని ఆయన తెలిపారు.