ప్రజాశక్తి-గుంటూరు : వేసవి నేపథ్యంలో ప్రజలకు ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరం నుండి సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారితో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు, ఎంపిడిఒలు, తహశీల్దార్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు, గడప గడపకు మన ప్రభుత్వం, జల జీవన్‌మిషన్, జగనన్నకు చెబుదాం, ఉపాధి హామీ పనులు, ఫించన్ల పంపిణీ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 3వ తేదీ వరకూ గడువు నిర్ణయించినందున ఆ మేరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేలా సిబ్బందికి తెలపాలన్నారు. దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి బదిలీలకు చర్యలు తీసుకోవాలన్నారు. బదిలీలు కోరుకునే వారికి సంబంధించి నో డ్యూ సర్టిఫికెట్లను సంబంధిత ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు జారీ చేయాల్సి ఉంటుందని, క్షేత్రస్థాయి, మండలాధికారులు, మున్సిపల్ కమిషనర్లు తప్పక సచివాలయాలను తనిఖీలు చేపట్టాలని చెప్పారు. జల జీవన మిషన్ కింద పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. గృహనిర్మాణ కాలనీల వద్ద ప్రవేశ ద్వారాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం ద్వారా అందిన పెండింగ్ ఫిర్యాదులపై శాఖల వారీగా జెసి సమీక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్ మాట్లాడుతూ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున జూన్ 1న సామాజిక పింఛన్లు తెల్లవారుజామునే పింఛనుదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, జెడ్పీ సిఇఒ జె.మోహన్‌రావు, ఐసీడీఎస్ పీడీ మనోరంజని పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి










