Jul 10,2023 16:03

సచివాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న దళిత కాలనీ యువకులు

తాగునీటి సమస్య పరిష్కరించాలని కార్యదర్శికి వినతి
ప్రజాశక్తి - పగిడ్యాల

      దళిత కాలనీలకు తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీకి చెందిన సుధీర్, పవన్, చిన్న, రంగా, హుస్సేనాయ్య, వెంకటరమణ డిమాండ్ చేశారు. సోమవారం పగిడ్యాల సచివాలయం 1 లో పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. పగిడ్యాల దళితవాడలోని ఏళ్ళ తరబడి తాగునీటి పైపులైన్లు వెయ్యకపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నగర్ లోని కర్రెమ్మ గుడి, పెద్ద బజారు, డేవిడ్ గల్లీలలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ గల్లీలకు నీతి సరఫరా చేయడం లేదని వారు మండిపడ్డారు. దళిత ప్రజా ప్రతినిధులు ఉండి కూడా దళిత కాలనీలకు నీటి సమస్య పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన సమస్య పరిష్కరిస్తామని చెబుతారు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.